మందమర్రి/చెన్నూర్/చెన్నూర్ రూరల్/కోటపల్లి/కాసిపేట, మే 3 : మంచిర్యాల జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడగా, చెట్లు విరిగి పడి ఇండ్లు, గోడలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. అక్కడక్కడా స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మందమర్రిలోని పాలచెట్టు, ప్రాణహిత కాలనీ, సీఈఆర్ క్లబ్ ఏరియా, బీటైప్ క్వార్టర్లు, కార్మిక కాలనీలతో పాటు పొన్నారం, వెంకటాపూర్, మామిడిగట్టు, సారంగపల్లి గ్రామాల్లో వృక్షాలు విరిగి రోడ్లపై పడగా, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కార్మెల్ పాఠశాల వద్ద భారీ వృక్షాలు విరిగి పడి క్వార్టర్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
వాహనాలపై చెట్ల కొమ్మలు పడ్డాయ. పలుచోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగ్లు గాలికి కొట్టుకు పోయాయి. మార్కెట్లో చిన్నచిన్న దుకాణాల షెడ్ల రేకులు గాలులకు కొట్టుకు పోయాయి. శంకర్పల్లి గ్రామ పంచాయతీలో గల సండ్రోన్పల్లి వద్ద గల రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధ్యాన్యం తడిసి ముద్దయ్యింది. తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు కూడా తడిసి పోయాయి. పలు గ్రామాల్లో మామిడికాయలు నేలరాలాయి. నేల కొరిగిన వృక్షాలను సింగరేణి రెస్క్యూ సిబ్బంది తొలగిస్తుండగా, స్తంభాలు, తీగలను సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి సింగరేణి, ప్రభుత్వ విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
చెన్నూర్ పట్టణంలో అరగంటపాటు గాలి దుమారంవీయగా, చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. చెన్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలమీద పడడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కొమ్మెర ట్రాన్స్కో ఈఏ కేశెట్టి శ్రీనివాస్ సిబ్బందితో మరమ్మతులు చేయించారు. కోటపల్లి, సర్వాయిపేట, పారుపల్లి, షట్పల్లి గ్రామాల్లో ధాన్యం తడిసిముద్దయింది. రాపనపల్లి గ్రామంలో ఆరె సంతు పెరట్లో పిడుగు పడగా, తాటి చెట్టుతో పాటు కంక చెట్టు కాలిపోయింది. కాసిపేట మండలంలో వైర్లు తెగి పడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.