నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల పాటు ఉరుము, మెరుపులతో భారీ వర్షం ( Heavy rain ) కురిసింది. దీంతో మట్టిరోడ్లు చిత్తడిగా మారాయి. ద్విచక్ర వాహన రాకపోకలకు, పాదచారులకు ఇబ్బందిగా మారింది. ఉమ్మడి మండలంలోని మట్టిరోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
రైతులు వేసుకున్న సోయా బీన్, మక్క వంటి పంటలను పొలంలోని మైదాన ప్రాంతంలో ఆరబెట్టారు. శనివారం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురవడంతో రైతులు తమ పంటలను తడిసిపోకుండా కాపాడేందుకు అవస్థలు పడ్డారు. సోయాబీన్, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పంటలు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం కలిగిందని, చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతు భరోసా పథకాన్ని అందిస్తే యాసంగి పంటలకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని డిమాండ్ చేస్తున్నారు.