దస్తురాబాద్/పెంబి, ఏప్రిల్ 27 : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేసి రైసు మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు.
విద్యుత్ సరఫరాలతో అంతరాయం ఏర్పడింది. అలాగే పెంబితోపాటు మందపల్లి గ్రామంలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. కోతకు వచ్చిన వరి పంట నేలకొరగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.