ఆదిలాబాద్, జూలై 11 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలకు వైద్యఆరోగ్య శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలోని నక్షత్ర హాస్పిటల్ నిర్వాహకులకు రూ.20 వేల జరిమానా పాటు హాస్పిటల్ మెడికల్ షాపు లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కలెక్టర్ రాజర్షి షా హాస్పిటళ్లను తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా హాస్పిటల్ నిర్వహణతో పాటు అనుబంధ మెడికల్ షాపులో పలు లోపాలను గుర్తించారు.
కార్డియాలజీ డాక్టర్ వివరాలు వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నమోదు చేయకపోవడం, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధిత చట్టం ప్రకారం హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం, వాహనాల పార్కింగ్ సదుపాయం లేకపోవడం లాంటి లోపాలు గుర్తించారు. దీంతో పాటు మెడికల్ షాపులో షెడ్యూల్ ఎక్స్ అమ్మకాలకు లైసెన్స్‌లు తీసుకోకపోవడం, ఫార్మసిస్ట్ లేకపోవడం, హెచ్1 రిజిష్టర్ నిర్వహణ, మందు విక్రయాల రసీదులు లేకపోవడం లాంటివి వెలుగుచూశాయి.
హాస్పిటల్ నిర్వాహకులు నిబంధనలు పాటించకపోవడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు రూ. 20 వేల జరిమానా విధించడంతో పాటు మెడికల్ షాపు లైసెన్స్‌ను రద్దు చేశారు. జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుల వివరాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చికిత్సలు అందించే డాక్టర్ల విద్యార్హతలు, సమ్మతి పత్రాలు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అందజేయాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. హాస్పిటల్ నిర్వహణ పీసీపీఎన్డీటీ చట్టం, హాస్పిటల్ ఎస్టాబిల్స్ మెంట్ నియమావళి ప్రకారం ఉండాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.