మంచిర్యాల, జూలై 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధరణిలో పెండింగ్ దరఖాస్తులు పేరుకుపోయాయి. గత కేసీఆర్ సర్కారు ధరణిలో మార్పులు చేసే అధికారాలన్నీ కలెక్టర్లకు ఇవ్వడంతో ఇవి పరిష్కారం కాలేదు. అందుకే దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాలను తహసీల్దార్లు, ఆర్డీవోలకు ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ సర్కారు..
అధికారాలన్నీ తహసీల్దార్లకు బదలాయించింది. మార్చిలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామంటూ చెప్పుకొచ్చింది. రైతు భూమిని అమ్ముకోవాలన్నా.. కొనాలన్నా ఆ రైతు వచ్చి బయోమెట్రిక్(వేలిముద్ర) పెడితినే అది సాధ్యం అవ్వాలి అనే సదుద్దేశంతో కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన ధరణిపై ఎన్నో విమర్శలు చేసింది. కొత్త విధానమంటూ ప్రకటనలు చేసింది. దానికి ముందు సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకు అధికారాలను కట్టబెడుతూ వెబ్‌సైట్‌లోని మాడ్యూల్స్‌ను మార్చింది.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలనే తీవ్రమైన పని ఒత్తిడితో కొందరు తహసీల్దార్లు ఏ చిన్న కారణం దొరికినా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. పరిష్కరిస్తున్న అప్లికేషన్ల కంటే తిరస్కరిస్తున్నవే ఎక్కువ ఉంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా.. తహసీల్దార్లకు అధికారాలు బదలాయించడంతో గతంలో కోర్టు కేసుల్లో కొట్లాడి, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి వచ్చిన దశలోనూ కొందరి అప్లికేషన్లు తిరస్కరణకు గురవుతున్నాయి.
భూ కబ్జాదారులకు అండగా నిలుస్తున్న కొందరు తహసీల్దార్లు గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలు, గత అధికారులు ఇచ్చిన ఆర్డర్లను తుంగలో తొక్కేస్తున్నారు. ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో వెలుగులోకి వచ్చింది. తమ భూమిని కబ్జా చేసిన ఇద్దరు అక్రమార్కులపై బాధితులు కోర్టులో కేసు గెలిచారు.
అదయ్యాక కోర్టు తీర్పు ప్రకారం అక్రమ డాక్యుమెంట్లను రద్దు చేయాల్సిన తహసీల్దార్ కోర్టులో స్టే ఉండగానే అదే అక్రమార్కులు చెప్పిన వారి పేరు మీదకు నాలా కన్వర్షన్ చేశాడు. బాధితులు దానిని సవాల్ చేయడంతో సీసీఎల్ఏ స్పందించి సదరు తహసీల్దార్‌పై చర్యలు తీసుకుని, నాలా కన్వర్షన్‌ను రద్దు చేయాలని బాధితులను న్యాయం చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
ఈ మేరకు గతంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా పని చేసిన బదావత్ సంతోష్ అర్డర్ కూడా ఇచ్చారు. ఈ టైమ్‌లోనే ధరణి అధికారాలకు కలెక్టర్ల నుంచి తహసీల్దార్లకు వెళ్లాయి. దీంతో కొత్తగా వచ్చిన మరో తహసీల్దార్ గత కోర్టు తీర్పును, సీసీఎల్ఏ ఆదేశాలను, కలెక్టర్ ఆర్డర్‌ను లెక్క చేయకుండా.. మరోసారి అక్రమార్కులకు అండగా తన లాగిన్లోకి వచ్చిన దరఖాస్తును తిరస్కరించాడు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చిందని బాధితులు తలలు పట్టుకుంటున్నారు.
ప్రజావాణిలో విషయాన్ని కొత్తగా వచ్చిన కలెక్టర్‌కు చెప్పుకుందామంటే ఆయన వినేందుకు ఆసక్తి చూపించడం లేదని వాపోతున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతూ ‘నమస్తే తెలంగాణ’ను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా..
అక్రమ పట్టాను రద్దు చేయమన్న కోర్టు..
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని సర్వే నంబర్ 996 సబ్ నంబర్లోని 2.22 ఎకరాల భూమిని ఏ.కమలాబాయ్, ఆర్.తారాబాయ్ ఇద్దరు అక్కాచెల్లెళ్లు 1972 సంవత్సరంలో కొనుగోలు చేశారు. వీళ్ల బంధువులైన బానాల లక్ష్మీనారాయణ, రేవెల్లి రాజన్న ఆ భూమిని అక్రమంగా వాళ్ల పేరు మీదకు 2007లో పట్టా చేయించుకున్నారు.
దీనిపై కమలాబాయ్ కొడుకు సత్యనారాయణ, మరో పట్టాదారు ఆర్.తారాబాయి ఈ ఇద్దరు వ్యక్తులు మా భూమిని కొట్టేసి, దొంగ పట్టా చేయించుకున్నారని కేసు వేశారు. హైకోర్టు ఆదేశాలతో మంచిర్యాల జిల్లా ట్రిబ్యునల్ సాక్ష్యాధారాలను పరిశీలించి, వాస్తవాలను పరిగణలోకి తీసుకొని లక్ష్మీనారాయణ, రాజన్నలకు(ఆర్వోఆర్ ప్రొసిడింగ్ నెంబర్ః 41/2007)తో తేదీ 31.05.2007లో చెన్నూర్ తహసీల్దార్ జారీ చేసిన మ్యూటేషన్ ఆర్డర్‌ను రద్దు చేసి, జాయింట్ పట్టాదారులైన కమలాబాయ్, తారాబాయ్ల పేరు మీదకు రీస్టోర్ చేయమని ఆదేశాలు ఇచ్చింది.
బాధితులు కోర్టులో కేసు గెలిచాక అపోనెంట్ పార్టీ హైకోర్టు నుంచి ఆరు వారాలకు స్టేటస్ కో తెచ్చుకున్నారు. చెన్నూర్ తహసీల్దార్ రికార్డుల్లో ఎంట్రీలు చేయడానికి ముందు ఆరు వారాలు స్టేటస్కో మెయింటేన్ చేయాలంటూ కోర్టు జూన్ 14, 2022లో స్టే ఇచ్చింది.
కాగా.. ఈ స్టే ఉండగానే అప్పటి చెన్నూర్ తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్‌పాండే కోర్టు ఆరు వారాల స్టే ఉన్న పీరియడ్‌లోనే జూలై 6, 2022లో మరో నలుగురు నూక శంకర్, జెడల సతీశ్, కోమటిపెల్లి రమేశ్ మరొకరి పేర్ల మీదకు నాలా కన్వర్షన్ చేశారు. దీనిపై బాధితులు కంట్మెంట్ ఆఫ్ కోర్టు వేయకుండా తహసీల్దార్ అక్రమార్కుల దగ్గర డబ్బుల తీసుకుని నాలా కన్వర్షన్ చేశారంటూ ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ)కు ఫిర్యాదు చేశారు. ఏసీబీ నుంచి సీసీఎల్ఏకు ఫిర్యాదు వెళ్లడంతో స్పందించిన సీసీఎల్ఏ దీనిపై పూర్తి విచారణ చేయాలంటూ మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
తప్పు జరిగిందని తేల్చేసిన ఆర్డీవో రిపోర్ట్
సీసీఎల్ఏ ఆదేశాల మేరకు అప్పటి కలెక్టర్ మంచిర్యాల ఆర్డీవోను ఎంక్వైరీ అధికారిగా నియమించారు. విచారణ చేసిన అనంతరం ఆర్డీవో చెన్నూర్ తహసీల్దార్ చేసిన నాలా కన్వర్షన్ పూర్తిగా ఇల్లీగల్ అని, చట్టపరమైన నిబంధనలు పాటించకుండా, కోర్టు ఆదేశాలు, స్టేకు వ్యతిరేకంగా నాలా కన్వర్షన్ చేశారని గుర్తించారు. ఈ మేరకు తహసీల్దార్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసి, తగిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు సిఫార్సు చేశారు. దీనిపై కలెక్టర్ సీసీఎల్ఏకు నాలా కన్వర్షన్లో తప్పు జరిగింది. రివోక్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ లేఖ రాశారు.
ఇక్కడి దాకా వచ్చినా ప్రాసెస్ కొన్ని రోజులు ఆగిపోయింది. దీంతో ఆర్డీవో ఎంక్వైరీ చేసిన లెటర్, కలెక్టర్ సీసీఎల్ఏకు రాసిన లెటర్లను ఆధారంగా చేసుకుని బాధితులు కోర్టు ధిక్కరణ (కంటెంట్ ఆఫ్ కోర్టు) కేసు వేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సీసీఎల్ఏ కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా రెవెన్యూ రికార్డులను మార్చిన చెన్నూర్ తహసీల్దార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై పూర్తిస్తాయి రిపోర్ట్ సడ్మిట్ చేసి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని కలెక్టర్‌ను పేర్కొంది.
ఈ మేరకు కలెక్టర్ స్టేటస్ కో ఉన్నప్పుడు మీరు నాలా కన్వర్షన్ చేసుకున్నారు. ఇది చెల్లదు ధరణిలో దాన్ని తొలగించేందుకు మీరు వచ్చి వేలి ముద్రలు వేయాలంటూ అపోజిట్ పార్టీకి చెప్పారు. వారు రాకపోవడంతో బయోమెట్రిక్ లేకుండా ధరణిలో ఈ ట్రాన్సక్షన్‌ను క్యాన్సల్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీసీఎల్ఏను కోరారు.
ఎట్టకేలకు ఆర్డర్ ఇచ్చిన గత కలెక్టర్
సీసీఎల్ఏ అనుమతి ఇవ్వడంతో ధరణిలో అక్రమంగా జరిగిన ఈ నాలా కన్వర్షన్‌ను రద్దు చేసేందుకు కలెక్టర్ మాన్యువల్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్‌ను ధరణిలో అప్లోడ్ చేసి కలెక్టర్ వేలిముద్ర పెడితే పనైపోతుంది. కోర్టు ఆదేశాల మేరకు మా భూమి మాకు దక్కుతుందని బాధితులు సంబురపడ్డారు. సరిగ్గా ఈ సమయంలోనే ధరణి వెబ్సైట్లో మాడ్యూల్స్ ఛేంజ్ అయ్యాయి. తహసీల్దార్లకు అధికారాలు బదలాయించ బడ్డాయి. ఏ అప్లికేషన్ అయినా తహసీల్దార్ నుంచి రావాలనే నిబంధనతో అన్నింటితోపాటు ఈ దరఖాస్తు కూడా తహసీల్దార్ లాగ్ ఇన్‌లోకి వెళ్లింది.
ఇక్కడే అసలు కథ మొదలైంది. కొత్తగా వచ్చిన తహసీల్దార్ మల్లికార్జున్ దగ్గరికి బాధితులు ఈ డాక్యుమెంట్లు అన్నీ తీసుకెళ్లి ఇచ్చారు. జరిగిన స్టోరీ కోర్టు కేసు, సీసీఎల్ఏ ఆదేశాలు, కలెక్టర్ ఆర్డర్ అన్ని సడ్మిట్ చేశారు. దానికి తహసీల్దార్ చూసి చేస్తామని చెప్పారు. ఇంత కష్టపడ్డాం కచ్చితంగా పనైపోతుంది అనుకున్నారు.
కానీ.. తహసీల్దార్ కలెక్టర్ ఆర్డర్‌ను, సీసీఎల్ఏ డైరెక్షన్, కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకోలేదు. పట్టాదారులుగా మేం లేకుండా గుర్తుతెలియని వ్యక్తులు ధరణిలో నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేశారంటూ అక్రమార్కులు ఇచ్చిన ఫిర్యాదే.. వీటన్నింటికంటే ఆయనకు ఎక్కువైపోయింది. పట్టాదారులు దరఖాస్తు చేసుకున్నందున ఈ అప్లికేషన్‌ను మేము క్యాన్సల్ చేస్తున్నామని చెప్పి క్యాన్సల్ చేశారు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
కలెక్టరేట్ నుంచి ఇంత క్లీయర్‌గా బయోమెట్రిక్‌కు మినహాయింపు ఇవ్వాలని లెటర్ ఉన్నప్పటికీ.. దాన్ని పక్కదోవ పట్టిస్తూ బయోమెట్రిక్ పట్టాదారు పెట్టలేదని ఫిర్యాదుతో తహసీల్దార్ దరఖాస్తు రిజక్ట్ చేశారని.. తమ కష్టం చెప్పుకునేందుకు బాధితులు కొత్త కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చారు.
సమస్య వినేందుకు విసిగించుకున్నరు..
సోమవారం ప్రజావాణిలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ను కలిసి సార్ గత కలెక్టర్ బాదావత్ సంతోష్ ఇలా ఆర్డర్ ఇచ్చారని, విషయం చెప్పే ప్రయత్నం చేశారు బాధితులు. దానికి కలెక్టర్ ఆ కలెక్టర్ ఇచ్చిన దానికి నాకు సంబంధం లేదు. పట్టాదారులు దరఖాస్తు చేయలేదని చెప్పారు.
మా రూల్స్ ప్రకారం మేం దాన్ని రిజెక్ట్ చేశామంటూ కలెక్టర్ సమాధానం చెప్పారని బాధితులు చెప్పారు. ఆ ట్రాన్సక్షన్ ఎలా జరిగింది.. కోర్టులో కేసు ఏంటి.. సీసీఎల్ఏ ఏం చెప్పింది. పట్టాదారు బయోమెట్రిక్ ఇవ్వకుండా ఒక అప్లికేషన్ అప్లోడౌ ఈ స్టేజ్ వరకు వచ్చి గత కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారంటే దాని వెనుక ఏం జరిగిందనేది ఒకసారి మీ సెక్షన్ వాళ్లను అడగండంటూ కలెక్టర్‌ను రిక్వెస్ట్ చేసినట్లు బాధితులు చెప్తున్నారు. దీనికి కలెక్టర్‌ను నుంచి సరైన స్పందన రాలేదని పాత కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్‌ను కొత్తగా వచ్చిన కలెక్టర్ సంబంధం లేదంటే ఎలా అంటూ బాధితులు వాపోతున్నారు.
ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ మండిపడుతున్నారు. కోర్టు ధిక్కరణ కేసు వేసినప్పుడు జడ్జి.. రికార్డుల్లో మేము మారుస్తున్నాం, రివోక్ చేస్తున్నామని డీటీ, తహసీల్దార్ కోర్టులో అఫిడవిట్ సడ్మిట్ చేశారు. మీకు శిక్ష కావాలా? లేక పని కావాలా? అని అడిగారు. పనైతే చాలు, శిక్ష వేయించడం మా ఇంటెక్షన్ కాదు అని చెప్పడంతో కోర్టులో కేసును డిస్పోజ్ చేశారు. అదయ్యాక కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు. అంతా అయిపోయింది.
ఈ సమయంలో కేవలం ధరణి అధికారాలను తహసీల్దార్లకు ఇవ్వడంతోనే తాము నష్టపోయామంటూ బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని కోర్టు తీర్పులను, సీసీఎల్ఏ డైరెక్షన్‌ను, కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేసిన తహసీల్దార్లపై చర్యలు తీసుకుంటుందా లేదా వేచి చూడాలి.