దండేపల్లి, మే14 : అష్టకష్టాలు పడి మక్క పండించిన రైతులు, వాటిని అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మార్క్ఫెడ్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో నత్తనడకన సేకరణ చేపడుతుండగా, రాత్రీ.. పగలూ పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇక కొనుగోళ్ల పేరిట కొర్రీలు పెడుతూ ముప్ప తిప్పలు పెడుతుండగా, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తూ తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
జిల్లాలో 6,816 ఎకరాల్లో మక్క సాగు
వరికి బదులుగా ప్రత్యామ్నాయ సాగు చేపట్టాలని వ్యవసాయాధికారులు చెప్పగా, మంచిర్యాల జిల్లాలో 6,816 ఎకరాల్లో రైతులు మక్క సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికిరాగా, కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని మక్క సాగు చేసిన రైతులకు చివరకు నిరాశే మిగులుతున్నది. నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుండడంతో వారంతా సతమతమవుతున్నారు.
గన్నీలు లేవు..ట్రాన్స్పోర్ట్ సమస్య
ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎకరాకు 25 క్వింటాళ్ల వరకే మక్కలు అమ్ముకునే అవకాశం రైతుకు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. మిగతా మక్కలు దళారులకు అమ్మాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తను తలపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో మక్కలు పోసి 20 రోజులు దాటినా, కాంటా పెట్టే పరిస్థితి లేదు. ఇక కాంటా పెట్టిన మక్కలు కూడా 20 రోజులు దాటినా ట్రాన్స్పోర్టు చేయడం లేదు. అధికారులు వచ్చి హామీలు ఇస్తున్నా లాభం లేదని రైతులు వాపోతున్నారు. గన్నీ సంచులు లేక కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన మక్కలు తూకం వేయడం లేదని రైతులు అంటున్నారు.
మద్దతు ధర కంటే తక్కువకు కొని..
కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలను ఆసరాగా చేసుకొని దళారులు రంగంలోకి దిగుతున్నారు. మద్దతు ధర కంటే తక్కువకే కొనుగోలు చేస్తూ జేబులు నింపుకుంటున్నా రు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 ఉండగా, రూ.1750కే తూకం వేస్తున్నారు. నేరుగా రైతు వద్దకు వెళ్లి బేరసారాలు చేసి, బుట్టలో వేసుకుంటున్నారు. క్వింటాలుకు రూ.650 వరకు రైతులు నష్టపోతున్నారు.
కుప్పపోసి 23 రోజులైతంది
ప్రభుత్వం కొనుగోలు చేస్తే మద్దతు ధర వస్తుందని మాకులపేటకు మక్కలు తెచ్చిన. 23 రోజుల కింద కుప్ప పోసిన. ఇప్పటికీ జోకుత లేరు. వర్షాలు వస్తే మా పరిస్థితి ఏం కావాలి. బార్దాన్ లేక తూకం వేస్తలేరు. బార్దాన్ పంపి వెంట వెంటనే జోకాలే. లేకుంటే వానలకు తడిసి నష్టపోతం. ప్రభుత్వం, అధికారులు దయచూపాలే. – రామశెట్టి రాజబాపు, మాకులపేట
గోస పెట్టుడు ఎందుకు
సర్కారు మంచి రేటు ఇస్తుందని మక్కలు సెంటర్కు తెచ్చిన. తాళ్లపేట నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకులపేట సెంటర్కు మక్కలు తెచ్చి వారమైతంది. ఇప్పటికీ మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు. ఇంత గోసపెట్టుడు ఎందుకు. రోజూ ఇక్కడికి వచ్చి కావలి కాయాల్సి వస్తుంది. మక్కలు తూకం వేసి మమ్ములను ఆదుకోవాలే.
-పింగిలి రాయమల్లు, తాళ్లపేట
రోజూ కుప్ప చేసుడు.. పరదాలు కప్పుడు..
మక్కలు సెంటర్కు తెచ్చి వారమైతంది. రోజూ కుప్ప చేసుడు, సాయంత్రం పరదాలు కప్పుడు అయితుంది. అసలు కొంటరా కొనరా,,? ఎప్పుడు అడిగినా..రేపు మాపు అంటున్నరు. వర్షాలు రాకముందు జోకితే బాగుంటుంది. లేదంటే నష్టపోతం.
– అత్తె లక్ష్మి, మాకులపేట
మక్కలు జోకి 24 రోజులు అయింది..
మక్కలు జోకి ఇయ్యాల్టీకి 24 రోజులైతంది. ఇప్పటికీ తీసుకుపోతలేరు. రాత్రీ.. పగటూ ఇక్కడే కావలి కాస్తున్న. పరదాల కిరాయి ఇప్పటికే రూ.2 వేలు దాటింది. ఎవ్వరూ పట్టించుకుంటలేరు. బార్దాన్ బయట మేమే కొనుక్కున్నం. మక్కలు తరలించడానికి ట్రాన్స్పోర్ట్ పైసలు మేమే పెట్టుకోలంటున్నరు. పైసలు తర్వాత రిటర్న్ చేస్తమంటున్నరు. ఎందుకు రైతులను ఇలా సతాయిస్తున్నరో అర్థమైతలేదు. మక్కలు తడిస్తే మా పరిస్థితి ఏం కావాలి.
-పర్శినేని హరీశ్, మాకులపేట