కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ దహెగాం/ చింతలమానేపల్లి/రెబ్బెన/వాంకిడి/తిర్యాణి/కెరమెరి/కౌటాల, జనవరి 24 : ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను ప్రకటించే గ్రామ సభలు గందరగోళంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా నిరసనలు, నిలదీతలతోనే ప్రారంభమవుతున్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. దహెగాం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో రచ్చ జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితా చదువుతుండగా, ఒక్కసారిగా ప్రజలు తమకు ఇండ్లు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కావాలంటూ వేదిక ముందు బైఠాయించారు. అలాగే చింతలమానేపల్లిలో జాబితాల్లో అర్హులైన పేర్లు రాలేదని స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడెంలో ఇందిరమ్మ కమిటీ ఎంపికలో అవకతవకలు జరిగాయని, ఇందిరమ్మ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రెబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీలోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన గ్రామసభ రణరంగాన్ని తలపించింది. పథకాల జాబితా చదివి వినిపించగా, అనర్హులు, సంపన్నులకు ప్రాధాన్యమిచ్చారని, అర్హులైన తమకు ఇవ్వలేదంటూ స్థానికులు అధికారులను నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఏఐటీయూసీ నాయకులు వేదిక ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ అజ్మీర బాబురావు, మాజీ ఎంపీటీసీ కడతల మల్లయ్య, బీజేపీ జిల్లా అధికార ప్రతినిథి కేసరి అంజనేయులుగౌడ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, బీఆర్ఎస్ నాయకులు అక్కేవార్ దయాకర్ మాట్లాడుతూ అర్హులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వాలని కోరగా, డీపీవో భిక్షపతి స్పందిస్తూ మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అర్హులకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులుగౌడ్ బైఠాయించి నిరసన తెలిపారు.
నాయకులు పరికిపండ్ల సత్యనారాయణ, సిడాం రాజేశ్వర్, పంబాల శ్రీనివాస్, వేయిగండ్ల క్రిష్ణ, ఆసీఫ్ అలీ, పర్వతి అశోక్, రవీందర్‌గౌడ్ ఉన్నారు. వాంకిడి మండలం ఖిరిడీలో లబ్ధిదారులు ఇచ్చిన దరఖాస్తులను అధికారులు పూర్తిస్థాయిలో ఆన్లైన్ చేయలేదని, ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులను నిలదీశారు. కలెక్టర్ రావాలి, సమస్యలను పరిషరించాలని కోరుతూ రోడ్డు పై బైఠాయించి ధర్నా చేపట్టారు. తిర్యాణి మండల కేంద్రంలో జాబితాలో అర్హులైన వారి పేర్లు లేకపోవడంతో ప్రజలు నిలదీశారు. తప్పులు సరిచేసి తుది జాబితా విడుదల చేస్తామని డీటీడీవో, మండలప్రత్యేక అధికారి రమాదేవి నచ్చజెప్పడంతో వారు శాంతించారు.
ఎస్ఐ శ్రీకాంత్, ఈజీఎస్ ఏపీవో శాకీర్ ఉస్మానీ, ఏఈవో వినోద్, జూనియర్ అసిస్టెంట్ సాయి, కార్యదర్శి రాజేశ్వరి పాల్గొన్నారు. కెరమెరిలో జాబితాలో అర్హుల పేర్లు రాలేదంటూ గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ దత్తు ప్రసాద్‌రావు, ఎంపీడీవో అహ్మద్ అమ్జద్‌పాషా పాల్గొన్నారు. కౌటాలలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట పార్డీ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గ్రామ కార్యదర్శి అంజలి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గ్రామసభ నిర్వహించారని మండిపడ్డారు. కార్యదర్శిపై చర్యలు తీసుకొని, మళ్లీ గ్రామ సభ నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఎంపీడీవో ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు.