ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 19 : జిల్లాలో శనగల కొనుగోలుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. శనగల కొనుగోలుకు అనుమతించాలని కోరారు. జిల్లా పరిస్థితులను వివరించారు. దీంతో వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్, శనగల కొనుగోళ్లను సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. జిల్లాలో వ్యవసాయ పరిస్థితులపై ఎమ్మెల్యేలతో చర్చించారు.
అధికారులు వెంటనే జిల్లాలో మద్దతు ధరకు శనగలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. దీనిపై ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే బోథ్ మండలాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఎంపీపీ తుల శ్రీనివాస్ సీఎంకు విన్నవించారు. మండల సమగ్రాభివృద్ధి కరదీపిక పుస్తకాన్ని అందజేశారు. కాగా, జిల్లాలో ఉత్తమ ఎంపీపీగా అవార్డు అందుకున్నందుకు గాను ఆయనను సీఎం అభినందించినట్లు తెలిపారు.