భైంసా, అక్టోబర్ 13 : భైంసా పట్టణంలో ఆదివారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగింది. విశ్రాంతి భవనం ఎదుట, పురాణాబజార్లో గల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాశ్ కుమార్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పూజలు నిర్వహించారు. ఈ శోభాయాత్ర యువకుల నృత్యాలు, కోలాటాలు, పోతరాజుల విన్యాసాల మధ్య కొనసాగింది. పట్టణ సమీపంలో గల గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దుర్గామాత ప్రతిమలను నిమజ్జనం చేశారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు ప్రాజెక్టు వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేపట్టారు.
దుర్గామాతల నిమజ్జనం సందర్భంగా ఆదివారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ, నలుగురు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, 250 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. నిమజ్జనోత్సవం సందర్భంగా యువకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆయా రూపాల్లో ఉన్న దుర్గామాతలకు పట్టణవాసులు పూజలు జరిపారు. శోభాయాత్ర దృశ్యాలను మహిళలు, చిన్నారులు తడాబాలపై నుంచి తిలకించారు. శోభాయాత్ర మార్గంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.