ఆదిలాబాద్ : ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పనిచేస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah ) అన్నారు. పదవ తరగతి ఫలితాల్లో ఉన్నత ఫలితాలను సాధించుకున్నామని పేర్కొన్నారు. మన్నుర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచే విధంగా ప్రతి ఒక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, డిజిటల్ క్లాస్ రూమ్స్, బోధన, కృత్రిమ మేధా, తరగతుల నిర్వహణ గురించి తల్లిదండ్రులకు వివరించాలని కోరారు.
తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో బోధన, ఆరోగ్య పాఠశాల నిర్వహణ, ఆహ్లాదమైనటువంటి పాఠశాల వాతావరణం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్, మండల విద్యాధికారి ఉదయ్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.