కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములకు కొదువలేదు. ఆసిఫాబాద్ కేంద్రంతో పాటు పరిసరాల్లోని సుమారు ఐదు కిలోమీటర్ల వరకు వందలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. నిజాం సమయంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఉండగా. ఆ తర్వాత ఆదిలాబాద్‌కు మార్చడంతో, ఇక్కడ ఉన్న వందలాది ఎకరాల సర్కారు భూములు క్రమంగా కబ్జాకు గురయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం ఆసిఫాబాద్‌ను మళ్లీ జిల్లాగా ప్రకటించింది.
జిల్లా కేంద్రం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని సర్వే నంబర్ల ఆధారంగా రెవెన్యూ రికార్డుల ప్రకారం అధికారులు స్థలాలను 2017లో గుర్తించారు. దీని ప్రకారం అంకుసాపూర్లోని సర్వే నంబర్లు 9, 87లలో 403 ఎకరాల్లో గతంలో 64 ఎకరాలను రైతులకు ఇవ్వగా, మిగిలిన 339 ఎకరాలు గిరిజనేతరుల ఆక్రమణలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాలెగూడ శివారులోని సుమారు 24 రకాల వివిధ సర్వే నంబర్లలో ఉన్న 220 ఎకరాల భూముల్లో 15 ఎకరాలు రైతులకు అసైండ్ చేయగా మిగిలిన 204 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. గోవింద పూర్లోని సర్వే నంబర్లు 39, 64 లతో 156 ఎకరాల్లో 94 ఎకరాలు రైతులకు పంచగా, మిగిలిన 61 ఎకరాలు కబ్జాకు గురైంది. మేకలవాడ, కెస్లాపూర్, పిప్పల్నవేగాం, ఎల్లారం, ఆసిఫాబాద్, గోడవెల్లి, జన్కాపూర్ ప్రాంతాల్లోని దాదాపు 28 రకాల సర్వే నంబర్లు ఉన్నాయి.
ఈ సర్వే నంబర్లలో దాదాపు 1500 ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. వీటిలో 812 ఎకరాల వరకు రైతులకు వివిధ సందర్భాల్లో అసైండ్ చేశారు. ఇక మిగిలిన 680 ఎకరాల్లో 300 ఎకరాలు అటవీ ప్రాంతం పోను మిగిలిన స్థలాలన్ని ఆక్రమణల్లోనే ఉన్నట్లు అధికారులు నాడు గుర్తించారు. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలకు కొన్నింటిని కేటాయించారు. ఇక ఓ చోట ప్రభుత్వ స్థలాన్ని అధికారులు అప్పట్లో సాయుధ పోలీసు దళాల కోసం కేటాయించారు. బోర్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడది చెరిగిపోయింది. స్థలం మాత్రం కబ్జా కోరల్లోనే ఉంది. దీనిని కూడా విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ స్థలాలు రియల్టర్లకు కాసులు కురిపిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.