నెన్నెల, జనవరి 12 : కొందరు కాంట్రాక్టర్లు అభివృద్ధి పేరిట అక్రమ మొరం దందాకు తెరలేపారు. యథేచ్ఛగా లారీల్లో తరలిస్తూ సర్కారు ఆదాయానికి గండికొడుతున్నారు. ఇంటిముందు పోసుకోవడానికి ట్రాక్టర్ టిప్పునకు అనుమతివ్వని మైనింగ్ అధికారులు, ఈ విషయంలో మాత్రం నోరుమెదపకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెన్నెల మండలం బొప్పారం ప్రాంతంలోని సర్వే నంబర్ 674లోగల ప్రభుత్వ భూమిలోని మొరాన్ని అక్రమంగా తరలించుకుపోతున్నారు. బెల్లంపల్లి మండలం చంద్రపెల్లి గ్రామానికి వేస్తున్న రోడ్డు కోసం వాడుతున్నారు.
మొరం తరలింపు కోసం మొదట కాంట్రాక్టర్ నామమాత్రంగా రెవెన్యూ అధికారులను కలిసి అనుమతులు కావాలని అడిగాడని, వారు ఆర్డీవో, కలెక్టర్ వద్ద అనుమతులు తీసుకోవాలని చెప్పారని తెలిసింది. కానీ సదురు కాంట్రాక్టర్ ఇవేమీ పాటించకుండా స్థానిక నాయకుల పేరు చెప్పి ప్రతి రోజూ దాదాపు 50 లారీల్లో మొరం తరలిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే నా ఇంటికి తీసుకుపోతున్నానా.. రోడ్డు కోసమే కదా అంటూ నిర్లక్ష్యపు సమాధానమిస్తున్నట్లు వారు తెలిపారు.
ప్రభుత్వానికి రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. అక్రమంగా మొరం తరలిస్తున్నారంటూ అధికారులకు సమాచారమిచ్చినా ఫలితం లేకుండా పోతుందని బొప్పారం రైతులు చెబుతున్నారు. ఈ విషయమై జిల్లా మైనింగ్ అధికారిని ఫోన్ ద్వారా సంప్రదిస్తే స్పందించలేదు. నెన్నెల ఆర్ఐ సూలోచనను అడుగగా, అక్రమంగా మొరం తరలిస్తున్న విషయం తెలిసిందని, ఎలాంటి అనుమతులు లేవన్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న విషయంపై విచారణ చేపడుతామన్నారు.