హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : సివిల్, మెకానికల్ కోర్సుల్లో 52%, ఎలక్ట్రికల్‌లో 46% ఇలా రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్ బ్రాంచీల్లో సీట్లకు కోతపడింది. ఈ కోర్సుల్లో భారీగా సీట్లు తగ్గిపోయాయి. ఇదేదో దశాబ్దకాలంలో అనుకుంటే పొరపాటు పడ్డట్టే. 2019 నుంచి 2025 మధ్య కాలంలోనే. అంటే ఐదేండ్ల కాలంలోనే దాదాపు 50% కోర్ ఇంజినీరింగ్ సీట్లకు కోతపడింది. కాలేజీలు, యాజమాన్యాలు ఈ కోర్సుల్లోని సీట్లను తగ్గించుకుంటున్నాయి. తగ్గిన ఈ సీట్ల స్థానంలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎస్ఈ) సీట్లు పెంచుకుంటున్నాయి. 2026-27 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషన్ జారీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఏప్రిల్‌లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి అఫిలియేషన్(ఏఐసీటీఈ) అనుమతులిస్తుంది. అయితే ఈ సారి కూడా అదే జరుగుతుందా..? కోర్ కోర్సుల్లో సీట్లు మరిన్ని తగ్గుతాయా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది.
మే రెండో వారంలో ఫలితాలు విడుదలవుతాయి. ఆ తర్వాత ఇంజినీరింగ్ సీట్ల భర్తీ కౌన్సెలింగ్ మొదలవుతుంది. ఈ ఐదేండ్ల కాలంలో సీఎస్ఈ కోర్సుల్లో విద్యార్థుల చేరికలు 20% పెరిగాయి. ఐదేండ్ల క్రితం 42శాతమున్న ఎన్రోల్మెంట్ ఇప్పుడు 62శాతానికి పెరిగింది. 2019లో సీఎస్ఈ కోర్సులో 29వేల సీట్లు నిండితే, 2025కు వచ్చేసరికి 48వేలు నిండాయి. సీఎస్ఈ తర్వాత అంతో ఇంతో డిమాండ్ ఉన్న ఏకైక కోర్సు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు మాత్రమే. ఈ కోర్సులో చేరే వారి సంఖ్య కేవలం 5% మాత్రమే తగ్గింది. సీట్లు కూడా 8% లోపు తగ్గాయి. 2017లో 13,500 సీట్లు నిండితే.. 2025లో 12,600 మంది చేరారు. అంటే 5% మాత్రమే ప్రవేశాలు తగ్గాయన్నమాట.
ఎన్రోల్మెంట్ కూడా
50% ఇంజినీరింగ్ కాలేజీలు క్లోజ్..
రాష్ట్రంలో పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడుతున్నాయి. 2017-2025 మధ్య 50% మూతపడ్డాయి. ఐదేండ్ల క్రితం కాలేజీల సంఖ్య 353 ఉంటే, ఇప్పుడు 175కు చేరాయి. రాష్ట్రంలో ఒక కాలేజీ సగటు విద్యార్థుల సంఖ్య 611 మాత్రమే. జాతీయ సగటు 709గా ఉంది. విద్యార్థులు చేరకపోవడం, అధ్యాపకుల కొరత, ఏఐసీటీఈ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో యాజమాన్యాలు కాలేజీలను క్లోజ్ చేస్తున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు డీమ్డ్, ప్రైవేట్ వర్సిటీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. దేశంలోని ఇంజినీరింగ్ హబ్‌ల్లో తెలంగాణ ఒకటి. 40% స్థూల నమోదు నిష్పత్తితో ఉన్నత విద్య భాగస్వామ్యంలో అగ్రగామి రాష్ట్రంగా ఉంది. రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలుండగా, వీటిలో 91% ప్రైవేట్ కాలేజీలే. వీటిల్లో 1.30 లక్షల సీట్లున్నాయి.