వరంగల్, మార్చి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఎట్లున్నవే నా పల్లె.. ఎట్లున్నవే నా తల్లీ’ అని తెలంగాణ పల్లెను మళ్లీ ఇవ్వాళ మందలివ్వాల్సిన పరిస్థితి దాపురించిందా? అంటే క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణం అవుననే అంటున్నది. రేవంత్ సర్కార్ పుణ్యమా అని ఏ రైతును కదిలించినా జిల్లాలో అగమ్యగోచరమైన పరిస్థితులే కండ్లముందు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడే గిట్లుంటే.. వచ్చే రెండు నెలలు ‘చావుమర్నమే’ ఉన్నది అని జయశంకర్ – భూపాపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం గణేశ్పల్లి రైతు లడే రవీందర్ వెలిబుచ్చిన ఆవేదనతో రాష్ట్ర రైతాంగం ఏకీభవించే పరిస్థితులు నెలకొన్నాయి. కరెంట్ ఉన్నకాడ నీళ్లు ఉండవు.. నీళ్లున్నకాడ కరెంట్ ఎప్పుడొస్తదో తెలియని దుస్థితి వరంగల్ జిల్లాలో నెలకొన్నది. అసలే చాలీచాలనీ నీళ్లు ఆపై అప్రకటిత కరెంట్ కోతలు అన్నట్టే ఉన్నది.
వరంగల్ జిల్లా ఒక్క సంగెం మండలంలోనే బొల్లికుంట, కాపులకనిపర్తి, ఆశాలపల్లి, గవిచర్ల, లోహిత, రామచంద్రాపురం సహా 13 గ్రామాల్లో దేవాదుల నీరు రాక పంటలు ఎండుతున్నాయి. దేవాదుల ప్రాజెక్టుతో అనుసంధానమైన కాలువ ద్వారా చెరువులు నిండితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటంతో మక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకో 20 రోజులైతే మక్కజొన్న, నెలన్నర, రెండు నెలలైతే వరి చేతికి వస్తుందని, ఇప్పుడు ఎలాగోలా తడి తప్పిచ్చి తడి పెట్టినా పంటలను కాపాడుకోవచ్చు.. కానీ, పొట్టకొచ్చాక మాత్రం నీళ్లు పెట్టుకపోతే కష్టమంతా ఆవిరైపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు జయశంకర్-భూపాలపల్లి, వరంగల్, ములుగు జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో సగటును మూడు మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయని, ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న 15-20 రోజుల్లో ఎండల తీవ్రత పెరిగి, వేసిన పంటలకు నీటి అవసరం పెరిగే అవకాశం పుష్కలంగా ఉంటే భూగర్భ జలాలు మరింత కిందికి పోయే ప్రమాదం ఉందనే ఆందోళన నెలకొన్నది.
కాలువ అంచున చేను. అయినా నీళ్లు లేక పంట ఎండిపోయింది. మొన్న వానకాలంలో మూడున్నర ఎకరాల్లో మక్కజొన్న వేసిన. అప్పుడు వానలెక్కువై జాలువట్టి పంట దిగుబడి రాలే. ఇప్పుడు యాసంగిలో కూడా అదే మక్కజొన్న వేసిన. కాలువ పక్క ఉన్న పంట మంచిగ పండుద్ది అనుకున్న. కానీ, నీళ్లు రాక ఎండిపోయింది. ఎలక్షన్లప్పుడు నాయకులు వత్తరు కని.. పంటలప్పుడు వాళ్లకేం అక్కెర. పంట కోసం బావికాడనే ఉంటం. బుక్కెడు బుక్కెడు నీళ్లు తాగి పనులు చేసుకుంటం. పంట ఎండిపోయింది.. పెట్టుబడి కూడా రాకపాయే.
-మద్దూరి కట్టమల్లు, రామచంద్రాపురం, సంగెం మండలం వరంగల్ జిల్లా
ఎండాకాలం మొదలు మొదలే గిట్లుంటే వచ్చే రెండునెలలు (ఏప్రిల్, మే) మరింత అధ్వానమే ఉండేటట్టు ఉన్నది. కరెంట్ కోత షురువైంది. కరెంట్ ఇష్టమొచ్చినట్టు వస్తుం ది. ఇష్టమొచ్చినట్టు పోతుంది. అడిగినా పట్టిచ్చుకునేడే లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పోవుడు అన్న ముచ్చటే లేకపోయేది.
-లడే రవీందర్ , మొగుళ్లపల్లి మండలం గణేశ్పల్లి, భూపాలపల్లి జిల్లా