మంచిర్యాల, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హోటల్‌కెళ్లి భోజనం చేసినా.. చివరకు చిన్న పిల్లలు తాగే పాలు కొన్నా.. సామాన్యుల నుంచి ముక్కు పిండి మరీ జీఎస్టీ వసూలు చేసే సర్కారు, అదే ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన కోట్లాది రూపాయల ట్యాక్స్‌లపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
ఇలా మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి ప్రభుత్వానికి రూ.24.72,703 జీఎస్టీ రావాల్సి ఉండగా, యంత్రాంగం ఎగ్గొట్టింది. యేటా బల్దియా పరిధిలో తై బజార్, మేకల మండి, స్లాటర్ హౌస్, మటన్ మార్కెట్ తదితర దుకాణాలకు వేలం పాట నిర్వహిస్తుండగా, అందులో వచ్చిన మొత్తంపై 18 శాతం జీఎస్టీ మున్సిపాలిటీకి చెల్లించాలి. మున్సిపాలిటీకి వసూలైన జీఎస్టీని ప్రభుత్వానికి కట్టాలి. కానీ.. గత నాలుగేళ్లుగా వేలం దక్కించుకున్న వారి నుంచి జీఎస్టీ వసూలు చేయడంలో మున్సిపల్ యంత్రాంగం విఫలమవుతున్నది.
నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ వేలం ప్రకటన విడుదల చేసినప్పుడు అందులో జీఎస్టీ గురించి ప్రత్యేకంగా పేర్కొంటారు. ఎవరు వేలం పాట దక్కించుకుంటారో ఆ మొత్తంపై 18 శాతం జీఎస్టీ కలిపి కట్టాలి. జీఎస్టీ లేకుండా డబ్బులు మాత్రమే కట్టడానికి, మున్సిపాలిటీ తీసుకోవడానికి వీలులేదు. ఈ మేరకు నిబంధనలు రూపొందించిన అధికారులే వేలం పాడిన డబ్బులు మాత్రమే తీసుకొని, జీఎస్టీ కట్టించుకోవడం లేదు. నిబంధనలు పెట్టడానికే కానీ.. వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదా అన్న ప్రశ్న తలెత్తుతున్నది.
ఈ విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సైతం అనుమానాలకు తావిస్తున్నది. ఇంటి పన్నులు, ఆస్తి పన్నుల విషయంలో కఠినంగా వ్యవహించే బల్దియా అధికారులు.. లక్షలాది రూపాయాల జీఎస్టీ ఎగొట్టిన వేలం దారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇది అధికారుల నిర్లక్ష్యం.. చేతివాటం తప్ప మరొకటి కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని అన్ని బల్దియాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తున్నది.
మంచిర్యాలలో ప్రస్తుతం తై బజార్లో షాపులు నిర్వహించే వారి నుంచి వేలం దక్కించుకున్న వారు ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు. ఎవరూ కట్టాల్సిన అవసరం లేదని స్థానిక ఎమ్మెల్యే పీఎస్సార్ మాట ఇచ్చారు. ఈ నిర్ణయంపై చిరు వ్యాపారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. తై బజార్ సహా మేకలమండి, స్లాటర్‌హౌస్/మటన్ మార్కెట్లపై జీఎస్టీలు ఎందుకు వసూలు చేయడం లేదన్నది అంతుబట్టడం లేదు.
సరే తై బజార్ ఒక్కటి పక్కన పెట్టారనుకున్నా.. నిబంధనల ప్రకారం జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వడానికి మాత్రం వీలులేదు. సరే చిల్లర వ్యాపారుల కోసం అనుకొని మినహాయింపు ఇచ్చినా.. మిగిలిన వారి నుంచైనా వసూలు చేయాలి కదా. న్యాయంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఎగొట్టేంత ధైర్యం ఎలా వచ్చింది. అధికారులకు మామూళ్లు ముడుతున్నాయా.. లేకపోతే రాజకీయ ఒత్తిడులు ఏమైనా ఉన్నాయా.. అన్న చర్చ నడుస్తున్నది. మరి ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు పెండింగ్ జీఎస్టీ వసూళ్లపై దృష్టి సారిస్తారా.. లేదా అన్నది ఆసక్తిగా మారింది.
తై బజార్, మేకలమండి నిర్వాహకులకు జీఎస్టీ చెల్లించాలని నోటీసులు ఇచ్చాం. వేరే మున్సిపాలిటీల్లో ఎక్కడా జీఎస్టీ తీసుకోవడం లేదని చెబుతున్నారు. ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు అంటున్నారు. అయినా మేం నోటీసులు ఇస్తున్నాం. వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. చెల్లించని పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అంశాన్ని మున్సిపల్ కమిషనర్ పరిశీలిస్తారు.
– శ్రీనివాస్‌రెడ్డి, మంచిర్యాల మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్