సారంగాపూర్, ఏప్రిల్ 28 : ఈ యాసంగిలో నిర్మల్ జిల్లావ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో జొన్న సాగైందని గణాంకాలు చెబుతున్నాయి. జొన్న పంట కోతలు కూడా పూర్తయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో పంట ఉత్పత్తులు కల్లాల్లోనే పోసి మండిపోతున్న ఎండలోనే పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు ఈదురుగాలులతో కూడన వర్షం వస్తుందోనని భయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి కూడా వచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.3699 ఉండగా.. ప్రయివేట్ వ్యాపారులు రూ.1800 నుంచి రూ.2 వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామంటున్నారు. ఒకవేళ అమ్మితే క్వింటాలుకు రూ.1900 నుంచి రూ.2100 వరకు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం, వ్యాపారులు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయమై మార్క్‌ఫెడ్ డీఎం మహేశ్‌ను అడుగగా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని, వస్తే కొనుగోలు చేస్తామని తెలిపారు.
కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
ప్రభుత్వం జొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. నేను నాలుగెకరాల్లో లక్షకు పైగా అప్పు చేసి జొన్న సాగు చేశా. కల్లానికి తీసుకొచ్చి పక్షం రోజులు అవుతున్నది. ప్రభుత్వం కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నా. అలాగే ప్రైవేట్ వ్యాపారులు కూడా పంటను కొనడానికి ముందుకు రాడడం లేదు. దీంతో ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే జొన్న పంటను కొనుగోలు చేయాలి.
– డోలు ప్రవీణ్, రైతు, పొన్కూర్(స్వర్ణ)
రూ.5 లక్షలు ఖర్చు చేశా..
జొన్న పండించడానికి రూ.5 లక్ష లు పెట్టుబడి పెట్టా. కల్లానికి తీసుకొచ్చి పది రోజులు అవుతున్నది. అధికారులు కాంటాను ప్రారంభించక పోవడంతో భయపడుతున్నా. ప్రభుత్వ మద్దతు ధర రూ.3699 ఉంటే.. ప్రైవేట్ వ్యాపారులు పంట కొనడానికి ముందుకు రావడం లేదు. వర్షం కురిస్తే పంట తడిసి పోయే ప్రమాదం ఉంది. వెంటనే కొనుగోలు చేయకపోతే పెట్టుబడి పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వెంటనే జొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
– గుజ్జ నవీన్, రైతు, పొన్కూర్(స్వర్ణ)