మంచిర్యాలటౌన్, డిసెంబర్ 31 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. కేసీఆర్ సర్కారులో అప్పటి ఎమ్మెల్యే.. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు చొరవతో నిధులు మంజూరు కాగా, ఇటీవల టెండర్లు, అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయా చోట్ల పనులు ఊపందుకోగా, త్వరలో పూర్తయి అందుబాటులోకి వచ్చే అవకాశమున్నది. మంచిర్యాల పట్టణంలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడాన్ని గమనించిన దివాకర్‌రావు జాతీయ రహదారుల శాఖ నుంచి నిధులు రాబట్టారు. ప్రస్తుతం ఓవర్‌బ్రిడ్జిపై హైపర్ప్లాస్ పాలిస్టర్ మినరల్ షీట్లతో అత్యాధునిక పద్ధతుల్లో రోడ్డు నిర్మిస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో ఓవర్‌బ్రిడ్జిపై రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. ఓవర్‌బ్రిడ్జి నుంచి తోళ్లవాగు వరకు రూ. 15.14 కోట్లు మంజూరు చేయగా, టెండరు దక్కించుకున్న సంస్థ ఈ ఏడాది సెప్టెంబర్ 13న అగ్రిమెంటు చేసుకుని పనులు చేపడుతున్నది. అలాగే తోళ్లవాగు నుంచి రసూల్‌పల్లి వరకు రూ. 59.79 కోట్లు మంజూరుకాగా, 2022 ఆగస్టు 29న పనులను అగ్రిమెంటు చేసుకున్నారు. ఈ నిధులతో రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణాలు చేపడుతున్నారు. పాతమంచిర్యాల నుంచి ఓవర్ బ్రిడ్జి వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులకోసం రూ. 12.39 కోట్లు మంజూరుకాగా, 2023 మే 15న అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టర్ ప్రస్తుతం పనులు చేపడుతున్నాడు.
మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తానుంచి పట్టణం చివరన ఉన్న శ్రీనివాస గార్డెన్ వరకు ఉన్న జాతీయ రహదారి నం-363 ( హైదరాబాద్- కరీంనగర్- చాందా రోడ్డు) విస్తరణకు తెలంగాణ సర్కారు రూ. 35 కోట్లు మంజూరు చేస్తూ జీవో నం-444 ద్వారా ఉత్తర్వులు వెలువరించింది. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఈ రహదారి విస్తరణ పనులకు టెండరు ప్రక్రియ నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి పట్టణ పరిధి వరకు 3.8 కిలోమీటర్ల పరిధిలో ఈ రహదారిని నిర్మించనున్నారు. 132 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ రోడ్డులో ఇరువైపులా ఆరు అడుగుల స్థలాన్ని డ్రైనేజీ నిర్మాణంకోసం, అలాగే 12 అడుగులు యుటిలిటీస్కోసం (పైపులైన్లు, కరెంటు స్తంభాలు, టెలిఫోన్ స్థంభాలు, కేబుళ్లు) ఉపయోగించనున్నారు.
రెండు వైపులా 36 అడుగలు స్థలం వదిలేయగా.. మిగిలిన 96 అడుగుల వెడల్పు స్థలంలో రెండు వైపులా 48 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మించనున్నారు. ఈ స్థలానికి మధ్యలో మీటరున్నర స్థలంలో డివైడర్ నిర్మిస్తారు. మిగిలిన స్థలంలో ఇరుపక్కలా మూడు వరుసల రహదారిని నిర్మించాలని ప్రణాళికలు తయారు చేశారు. రెండు పక్కలా కలిసి మొత్తం ఆరువరుసల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. 3.8 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఆరు కల్వర్టులు, రెండు వంతెనలను నిర్మించాలని ఆర్అండ్బీ అధికారులు నిర్ణయించారు. మరోపక్క ఆర్అండ్బీ పరిధిలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తానుంచి బెల్లంపల్లి పట్టణం వరకు ఉన్న పాతరోడ్డును మరమ్మతు(స్ట్రెంథెనింగ్) చేసేందుకు రూ. 14.28 కోట్లు 2023 సెప్టెంబర్ 9న విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అన్నిచోట్లా పనులు పూర్తయ్యే అవకాశముండగా, ఇక రాకపోకలు సాఫీగా సాగనున్నాయి.