బలవర్ధకమైన పోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకూ అందించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలు పెట్టింది. త్వరలో పౌరసరఫరాల దుకాణాలకు పంపిణీ చేయనుండగా, నేడు ఈ అంశంపై ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు రైస్ మిల్లర్లకు అవగాహన కల్పించనున్నది. ఈ నిర్ణయంతో మంచిర్యాల జిల్లాలో 2,20,255 మందికి పోషకాహారం అందనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 23 : జిల్లాలోని 18 మండలాల్లోని 423 రేషన్ దుకాణాల పరిధిలోని లబ్ధిదారులందరికీ ఫోర్టిఫైడ్ రైస్ అందజేసే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సంబంధిత శాఖల అధికారులు, మిల్లర్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించింది. త్వరలోనే రేషన్ దుకాణాలకు సాధారణ బియ్యానికి బదులు ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) పంపిణీ చేయడానికి పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతున్నది. ప్రస్తుతం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.
జిల్లాలో 2.20 లక్షల మందికి పౌష్టికాహారం
ఇది వరకే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి, అంగన్వాడీ కేంద్రాలకు ఫోర్టిఫైడ్ బియ్యం అందిస్తున్న ప్రభుత్వం రేషన్ దుకాణాలకు సైతం పంపిణీ చేసేందుకు అడుగులు లేస్తున్నది. దీంతో జిల్లాలోని 2,20,255 మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు ఫోర్టిఫైడ్ బియ్యం అందనున్నది.
నేడు రైస్ మిల్లర్లకు శిక్షణ…
ఫుడ్ అండ్ సేప్టీ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నామ్స్ ఎలా పాటించాలనే విషయం మీద మంగళవారం హైదరాబాద్లో అన్ని జిల్లాల పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లకు టీఎస్సీఎస్సీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి అవగాహన కల్పించారు. విజయవంతం కావడానికి చేయాల్సిన విషయాలపై సూచనలు చేశారు. అలాగే ఈ నెల 24న ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు రైస్ మిల్లర్లకు అవగాహన కల్పించి వారి సూచనలు తీసుకోనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఫోర్టిఫైడ్ రైస్ అందించాలంటే మిషనరీ, తదితరాలపై చర్చించనున్నారు.