మంచిర్యాల, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ చేరికతో కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ మొదలైందా.. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పురాణం సతీశ్ పోయిన ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే సీటు ఆశించారు. తనకే టికెట్ వస్తుందని చెప్పుకుం టూ కొన్ని రోజుల పాటు ప్రచారం కూడా చేశారు. కానీ సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామన్న ప్రకటన రావడవంతో వెనక్కి తగ్గారు.
అలా మంచిర్యాలపై కన్నేసిన నాయకుడిని పార్టీలోకి తీసుకునే ముందు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావులతో కనీసం చర్చించకుండ చేర్చుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పురాణం సతీశ్ కాంగ్రెస్‌లో చేరే కార్యక్రమానికి కొక్కిరాల సురేఖ దూరంగా ఉండడం ఈ చర్చలకు బలం చేకూరుస్తున్నది. ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో జరిగిన పురాణం చేరిక కార్యక్రమంలో చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, గడ్డం వినోద్, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ మాత్రమే పాల్గొన్నారు.
దీంతో పురాణం సతీశ్ చేరిక వెనుక గడ్డం కుటుంబమే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పట్టుకోసమే పీఎస్సార్ కుటుంబానికి చెక్ పెట్టడంలో భాగంగానే పురాణాన్ని పార్టీలో చేర్చుకున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా, పురాణం సతీశ్‌నే నమ్ముకొని కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉంటూ వస్తున్న ఆయన అనుచరులు, నాయకుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నా జిల్లా అధ్యక్షుల అండదండలు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం దొరకడం కష్టమని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పురాణం వెంట వెళ్లి హస్తం పార్టీలో చేరడమా.. లేదా అని ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
చెన్నూర్ నియోజకవర్గంలో మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగలక్ష్మిలకు పురాణం చేరికతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అటు నల్లాల ఓదెలు కుటుంబాన్ని, ఇటు పురాణం సతీశ్ ఇద్దరిని సంతృప్తి పరచడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఓదెలు కాంగ్రెస్‌లో చేరి చెన్నూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అసలు టికెట్ కోసమే ఆయన ఆ పార్టీలో చేరారు. కానీ చివరి నిమిషంలో గడ్డం వివేక్ టికెట్‌ను ఎగరేసుకుపోయారు. నల్లాల ఓదెలును కలిసి బుజ్జగించుకున్నారు.
కానీ ఇప్పుడు పురాణం సతీశ్ పార్టీలోకి చేర్చుకున్న గడ్డం ఫ్యామిలీ గతంలో ఓదెలు కుటుంబానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందా.. ఓదెలు ఉండగా, పురాణంను పార్టీలో చేర్చుకోవాల్సి అవసరం ఏమొచ్చిందనే చర్చ జోరుగా సాగుతున్నది. ఒక రకంగా నల్లాల ఓదెలు వర్గానికి ఇది నచ్చడం లేదనేది విశ్వసనీయ సమాచారం. కాగా, పురాణం చేరికపై ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న నాయకులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే టికెట్ గడ్డం వివేక్‌కు, ఎంపీ టికెట్ గడ్డం వంశీకి ఇచ్చిన అధిష్టానం నామినేటెడ్ పదవుల కోసమైనా తమ పేర్లను పరిశీలిస్తుందన్న ఆశతో ఉన్నామని.. ఇప్పుడు ఆ పదవులు కూడా గడ్డం ఫ్యామిలీ పార్టీలోకి తీసుకువచ్చిన పురాణంలాంటి వాళ్లకు ఇస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించి, ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన సతీశ్ చేరికను పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గడ్డుకాలం తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.