సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 21 : పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కోరారు. ఆదివారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు హామీల అమలులో విఫలమైందని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేయలేదని, వడ్ల కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. కొప్పుల ఈశ్వర్ సామాన్య కుటుంబం నుంచి వచ్చారని, ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటువేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్‌కుమార్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు గరిసె రామస్వామి, పార్టీ ఉపాధ్యక్షుడు దెబ్బటి రామన్న, కౌన్సిలర్ వంగ తిరుపతి, నాయకులు ధర్ని శంకర్, పెరుమాళ్ల జనార్దన్, సత్తయ్య, రాయలింగు, సంపత్‌రావు, దేవ మల్లికార్జున్, పోశం, సోమిశెట్టి రామన్న పాల్గొన్నారు.