ఆదిలాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ) ః ఇచ్చోడ మండలంలోని కేశవపట్నంలో స్థానికులు ఏళ్లుగా అటవీ భూములను సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారని, వారిపై అటవీ శాఖ అధికారులు దౌర్జన్యం చేస్తే సహించేది లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. తాము 30 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు అక్రమించుకుని మొక్కలు నాటడానికి గుంతలు తవ్వుతున్నారని గ్రామస్తులు భారీ సంఖ్యలో శనివారం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గతేడాది బోథ్ నియోజకవర్గంలో అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. పోడు భూముల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న గిరిజనేతరుల సమస్యను పరిష్కరించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ ఆంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనేతరుల సమస్యను పట్టించుకోకపోవడంతో అటవీశాఖ అధికారులు భూములను స్వాధీనం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం, గుండాల, సిరిచెల్మ, ఎల్లమ్మగుట్ట, బాబ్జీపేట్ గ్రామాల్లో గిరిజనేతరులు వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నారని, ఇప్పడు భూములు కోల్పోతే వారికి ఉపాధి ఎవరు కల్పిస్తారని ప్రశ్నించారు.
అటవీ అధికారులు తమ తీరు మార్చుకోకపో తే ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ఆందోళనలు తీవ్రం చేస్తామని ఎమ్మెల్యే అనిల్ జాద వ్ సూచించారు. ఇటీవల తాను ఆ గ్రామాల్లో పర్యటించి అటవీ అధికారులతో చర్చించిన ట్లు తెలిపారు. వారు గ్రామస్తులపై వేధింపులు మానుకోకపోగా తిరిగి సాగు భూముల్లో ట్రెంచ్‌లు ఏర్పాటు, మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వడం చేస్తున్నారని తెలిపారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలోని గిరిజనేతరు సాగు చేస్తున్న అటవీభూముల విషయాన్ని తొందరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీంపూర్ జడ్పీటీసీ సుధాకర్, ఇచ్చోడ ఎంపీపీ ప్రీతమ్‌రెడ్డి, కేశవపట్నం ఎంపీటీసీ అల్తాఫ్ పాల్గొన్నారు.