కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ కెరమెరి, సెప్టెంబర్ 11 : పది రోజుల క్రితం వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీలోని కెరమెరి, ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లో గ్రామాలకు సమీపాల్లో సంచరిస్తూ, పశువులపై దాడులు చేస్తూ హల్చల్ చేసిన పులి ఆచూకీ పది రోజులుగా తెలియడం లేదు. గ్రామాలకు సమీపంలోనే తిరుగుతూ పశువులపై దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసిన పులిపై నిఘావేసి ట్రాక్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అటవీ అధికారులు పులి జాడను కనిపెట్టడంలో శ్రద్ధ చూపడం లేదని తెలుస్తున్నది. అటవీ సమీపంలోని చేలల్లో రైతులకు పులి కనిపించినా, పశువులపై దాడులు చేసినా హడావిడి చేసే అటవీ అధికారులు పది రోజులుగా పులి ఎక్కడ సంచరిస్తున్నదనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలోని పరందోలి, ముగ్ధంగూడా, దేవాపూర్, బోరిలాల్గూడా గ్రామాల సమీపంలోని పంట చేలలో పది రోజుల క్రితం వరకు సంచరించింది. ఈ విషయాన్ని రైతుల ద్వారా తెలుసుకున్న అటవీ అధికారులు పులి అడుగులను కూడా గుర్తించారు. పులిని ట్రాక్ చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పులిని ట్రాక్ చేయలేకపోయారు. ఆ తర్వాత తిర్యాణి సమీపంలోని అటవీ ప్రాంతాల్లో పులిసంచరిస్తున్నట్లు ఆచూకీ కనుగొన్నారు. అక్కడి నుంచి కవ్వాల్ అడవుల వైపు వెళ్లినట్లుగా.. మళ్లీ తిరిగి జిల్లాలోని కెరమెరిలోని సరిహద్దు అటవీ ప్రాంతాలకు వచ్చినట్లు పులి అడుగు జాడలను బట్టి గుర్తించారు. చివరగా ఆగస్టు 30న సాంగ్వీ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆ తర్వాత పులి ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని గుర్తించలేకపోయారు. కెరమెరిలోని సరిహద్దు గ్రామాలైన పరందోళి, దేవాపూర్, బోరిలాల్ గూడ అటవీ ప్రాంతాల గుండా మహారాష్ట్రలోకి వెళ్లిపోయిందా ? లేక జిల్లాలోనే సంచరిస్తుందా ? అనే విషయంపై నిర్ధారణకు రాకుండానే పులి సంచారంపై అన్వేషణ ఆపేసినట్లుగా తెలుస్తున్నది.
ఆగస్టులో జిల్లా కేంద్రానికి సమీపంలోని జనావాసాలకు దగ్గర పులి సంచరిస్తుండడం ప్రజల్లో ఆందోళన కలిగించింది. కాగజ్నగర్ మం డలం అంకుసాపూర్ అటవీ ప్రాంతంలో సంచరించిన పులి ఆ తర్వాత ఆసిఫాబాద్ మండలంలోని గుండి, గోవిందాపూర్ అటవీ ప్రాంతంలో పర్యటించింది. తమ పంట చేళ్లలో పులి అడుగులను గుర్తించి రైతులు అటవీ అధికారులకు సమాచారమివ్వడంతో పులి అడుగుజాడలను నిర్ధారించారు. మరుసటి రోజు తిర్యాణి అటవీలో పర్యటించిన పులి చి ర్రకుంట సమీపంలో ఆవుపై దాడి చేసింది. పులి ఆచూకీ తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన అటవీ అధికారులు జిల్లా కేందానికి ఆనుకొని ఉన్న అడవులతోపాటు కెరమెరి, తిర్యాణి అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల ద్వారా పులి అడుగుల కోసం గాలించారు. చివరి సారిగా ప రందోళి, దేవాపూర్, బోరిలాల్గూడా అడవుల్లో ఆగస్టు చివరి వారంలో సంచరించినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత ఆ పులి ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
కెరమెరి మండలంలోని సరిహద్దు గ్రామాల్లో సంచరించిన పులి సిద్ధికాస లేక శంకర్ లొద్ది అడవుల్లోని గుహ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు భావిస్తున్నాం. కెరమెరిలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన పరందోళి, దేవాపూర్, బోరిలాల్గూడా సమీపంలోని చేలల్లో సంచరించిన పులి చివరి సారిగా సాంగ్వీ-కేలికే గ్రామాల సమీపంలో కనిపించింది. ఆ తర్వాత పులి జాడ తెలియలేదు. సిద్ధికాస, శంకర్లొద్ది అటవీ ప్రాంతాల్లోని గుహల్లో పులి ఉన్నట్లు భావిస్తున్నాం. పులిపై నిఘా నిరంతరం కొనసాగుతున్నది. అటవీ ప్రాంత సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.