కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ వాంకిడి, నవంబర్ 26 : వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన శైలజ అంత్యక్రియలు ఆమె స్వగ్రామం దాబాలో మంగళవారం ఖాకీల ఆంక్షల నడుమ సాగాయి. అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీవో లోకేశ్వర రావు, డీటీడబ్ల్యూవో రమాదేవి, వాంకిడి తహసీల్దార్ రియాజ్ అలీ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ టీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, గ్రామస్తులు, బంధువు లు, మాలీ, గిరిజన సంఘాల నాయకులు, తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.
వాంకిడి నుంచి దాబా వరకు..
శైలజ అంత్యక్రియల నేపథ్యంలో దాబా గ్రామంలో పోలీసులు అడుగడుగునా మోహరించారు. ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ అలం ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి నుంచే వాంకిడి మండలంతో పాటు దాబా గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా శైలజ మృతదేహాన్ని తీసుకొచ్చారు. ప్రజా సంఘాలు, బంధువులు ఎలాంటి ఆందోళనలు చేయకుండా భద్రత ఏర్పాట్లు చేసి ఉక్కుపాదం మోపారు. శైలజ మృతదేహాం వద్దకు వెళ్లి కనీసం నివాళులర్పించే అవకాశం కూడా ఇవ్వలేదు. వాంకిడి మండల కేంద్రం నుంచి దాబా గ్రామం వరకు ప్రధాన కూడళ్లు.. మధ్యలో ఉన్న గ్రామాల వద్ద ప్రత్యేకంగా పోలీసు క్యాంపులు ఏర్పాటు చేశారు. దాబా గ్రామం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా.. బయట నుంచి ఎవరూ గ్రామంలోకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మీడియాను గ్రామంలోకి రాకుండా ఆంక్షలు విధించారు. శైలజ అంత్యక్రియలకు వచ్చే బంధువులను కూడా గ్రామంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి హౌస్ అరెస్టు
ఎమ్మెల్యే కోవ లక్ష్మిని సోమవారం రాత్రి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. మంగళవారం మాత్రం దాబా గ్రామానికి వెళ్లేందుకు అనుమతించారు. దీంతో కోవ లక్ష్మి దాబా గ్రామానికి వెళ్లి శైలజ కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లుతో సరి
శైలజ కుటుంబానికి అండగా నిలవాల్సిన అధికారులు కేవలం ఆమె ఇంట్లో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి సరిపెట్టారు. ఎక్స్‌గ్రేషియాపై ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేపోయారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దనసరి అనసూయ సీతక్కతో చర్చించిన తర్వాత ఈ విషయం తెలిపారు. శైలజ తల్లిదండ్రులు తుకారాం, మీరాబాయి తమకు ఐదు ఎకరాల భూమి, ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరారు. అధికారులు మాత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇంటితో సరిపెట్టడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం : ఎమ్మెల్యే కోవలక్ష్మి
శైలజ మృతిని కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం. కనీసం విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించకుండా పోలీసులు ఇంతటి నిర్బంధం పెట్టారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. శైలజ కుంటుంబానికి అండగా ఉంటాం. విద్యార్థి మృతి పట్ల ప్రజాసంఘాలు స్పందించకుండా పోలీసులు ఉక్కుపాదం మోపారు, అర్ధరాత్రి నన్ను హౌస్ అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి.
పరామర్శకు వెళ్లకుండా అడ్డుకుంటారా?
చెన్నూర్, నవంబర్ 26: శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లకుండా ఎమ్మెల్యే కోవ లక్ష్మిని అడ్డుకోవడం దారుణమని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి, మున్సిపాలిటీ కౌన్సిలర్ రేవెల్లి మహేశ్ మంగళవారం ఓ ప్రకటనలో ఖండించారు. తన నియోజకవర్గానికి చెందిన శైలజ కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్లకుండా ఇంట్లోకి చొరబడి హౌస్ అరెస్టు చేయడం సరికాదని తెలిపారు. శైలజ మృతికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను బట్టి ప్రభుత్వం గురుకులాలు, వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి భోజనాన్ని అందిస్తున్నదో స్పష్టమవుతుందని తెలిపారు.
కెరమెరిలో రాస్తారోకో
కెరమెరి, నవంబర్ 26 : శైలజ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, మాజీ జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కెరమెరిలో మాలీ సంఘం ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ, విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ శైలజకు సరైన వైద్యం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడాడ్డారు. విద్యార్థి మృతికి బాధ్యత వహిస్తూ ఆమె కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇందిరమ్మ ఇల్లుతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెందోర్ ఆనంద్‌రావ్, ఉత్తంనాయక్, కావుడే తులసీరాం, సుభాష్, భరత్ భూషణ్, తుకారాం, దేవేందర్, మహండోరే రవి, జగన్నాథ్రావ్, వినేష్, తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో..
కాసిపేట, నవంబర్ 26 : వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం దేవాపూర్‌లోని కుమ్రం భీం చౌరస్తా వద్ద ఆదివాసీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెడ్మ కిషన్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బాలిక చనిపోయిందని మండిపడ్డారు. బాలిక కుటుంబానికి నష్టపరిహారం కింద రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, బాలిక మృతి కారణమైన డీటీడీవో, ఏటీడీఏ, వార్డెన్, హెచ్ఎం, ఐటీడీఉ పీవోలను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థి సంఘం, తుడుం దెబ్బ అనుబంధ సంఘాలతో ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతామని హెచ్చరించారు. తుడుం దెబ్బ ఆదివాసీ సంఘాల నాయకులు ఆడె జంగు, పెంద్రం హన్మంతు, అనంతరావు, ఆత్రం జంగు, గోవర్ధన్, సిడం శంకర్, ప్రభాకర్, ఆత్రం మహేశ్, మడావి ధర్మారావు, సిడం జగన్, తరుణ్, రామారావు, లింగు, పవన్, అర్జున్, సాంబ పాల్గొన్నారు.