మంచిర్యాల టౌన్, ఆగస్టు 31 : మంచిర్యాల పట్టణం సమీపంలోని గోదావరితో పాటు రాళ్లవాగు ఉప్పొంగి.. పరివాహక ప్రాంత వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ప్రస్తుతం గోదావరి శాంతించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజానీకం ఊపిరిపీల్చుకుంటున్నది. ఎగువ ప్రాంతాల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తగ్గడంతో.. యంత్రాంగం గోదావరిలోకి తక్కువ మొత్తంలో నీటిని వదులుతున్నది. నాలుగు రోజుల పాటు గౌతమేశ్వర ఆలయం వరకు గోదావరి ప్రవహించగా, ఆదివారం ఉదయం పుష్కరఘాట్ల వరకు తగ్గింది. ఇక రాళ్లవాగు ప్రవాహం కూడా గోదావరిలోకి వెళ్తుండడంతో ఎన్టీఆర్ నగర్, రాంనగర్ ప్రాంతాల్లో పరిస్థితులు యథావిధిగా ఉన్నాయి. వరద ప్రవాహం తగ్గడంతో అక్కడి నివాస ప్రాంతాలతో పాటు గోదావరి పుష్కరఘాట్ల వద్ద మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టింది. చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు బ్లీచింగ్ను చల్లుతున్నది.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఆదివారం వేకువ జామున రెండు గంటలకు 728494 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉండగా, 697494 క్యూసెక్కుల నీటిని 37 గేట్ల ద్వారా గోదావరిలోకి వదిలారు. ఉదయం ఐదు గంటలకు 583186 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 601798 క్యూసెక్కులను వదిలారు. ఉదయం 10 గంటలకు 402537 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 304399 క్యూసెక్కుల నీటిని వదిలారు. మధ్యాహ్నం 12 గంటలకు 394273 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 21 గేట్ల ద్వారా 310162 క్యూసెక్కుల నీటిని వదిలారు. మూడు గంటలకు 381091 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, 21 గేట్లు తెరిచి 317980 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.
కోటపల్లి, ఆగస్టు 31 : గోదావరి ఉధృతికి పరివాహక ప్రాం తాల్లోని పంటలు నీట మునిగాయి. కోటపల్లి మండలం పారుపల్లి, ఎర్రాయిపేట, బోరంపల్లి, కొల్లూరు, రాంపూర్, దేవులవాడ గ్రామాల్లో వందలాది ఎకరాలు వరదపాలయ్యా యి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.