వేమనపల్లి/దహెగాం, జూలై 11 : మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రోండో రోజూ వరద ఉధృతి కొనసాగింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నదిలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. నది సమీపంలోని కల్లెంపల్లి, ముక్కిడిగూడెం, జాజులపేట, సుంపుటం, వేమనపల్లి, నీల్వాయి, కేతనపల్లి, ముల్కలపేట, రాచర్ల గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల పత్తి పంట నీట మునిగిపోయింది. వేమనపల్లి -సుంపుటం మధ్యలో ఉన్న రహదారిపై ప్రాణహిత నది వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
వేమనపల్లి నుంచి కల్లెంపల్లికి వెళ్లే ఆర్టీసీ బస్సును నిలిపివేశారు. అలాగే సుంపుటం, ముక్కిడిగూడెం, జాజులపేట, కల్లెంపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముల్కలపేట – రాచర్ల మధ్యలోని రహదారి నది వరదలో మునిగిపోగా, ఈ రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కోటపల్లి మండలం పారుపెల్లి గ్రామం మీదుగా చెన్నూరుకు వెళ్తున్నారు. మండల తహసీల్దార్ సంధ్యారాణి, నీల్వాయి ఎస్ఐ శ్యామ్‌పటేల్ నది ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రాణహిత నదిలో పడవలు నడపవద్దని, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసరమైతే డయల్ 100, కంట్రోల్ రూమ్ నంబర్ : 08736-250501కు సమాచారం అందించాలని సూచించారు.
ప్రాణహిత నది బ్యాక్ వాటర్‌తో మునిగిన రోడ్లను శుక్రవారం జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్‌పటేల్ పరిశీలించారు. రాచర్ల -ముల్కలపేట మధ్యలో ఉన్న రహదారి నీట మునిగిపోవడంతో పరిశీలించారు. వాహనదారులు వెళ్లకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని మొట్లగూడ, రాంపూర్, దిగడ గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. శుక్రవారం ఎంపీడీవో ఆల్బర్ట్ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు ప్రశాంత్,విజయ్, రాబ్బాస్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, జూలై11 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని కుమ్రం భీం (అడ) ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శుక్రవారం ప్రాజెక్టు మూడు గేట్లు 0.8 మీటర్ల మేర ఎత్తి 4.3 టీఎంసీల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా, శుక్రవారం ఉదయం నాటికి 235.800 మీటర్లకు చేరుకొంది. ప్రాజెక్టు సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా, ఇప్పటి వరకు 5395 టీఎంసీలకు చేరిందని అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో 5.7 టీఏంసీలుండగా, 4.7 టీఎంసీల నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.