Mancherial | నెన్నెల : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో మంగళవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టులో ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాలలో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. వరి పొలాలు వరదలో కొట్టుకుపోయాయి. వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్న పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వరద ఉధృతికి పత్తి మొక్కలు కొట్టుకుపోయాయి. నెన్నెల, మన్నెగూడెం, లంబాడితండా, జంగాలపేట గ్రామాలల్లో పత్తి పంట బాగా దెబ్బతింది. గొల్లపల్లి గ్రామంలో వరి పంట నీట మునిగి చెరువును తలపిస్తుంది. దారులుకూడా కనిపించడం లేదు. పలు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వర్షం మరో 72 గంటల పాటు ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.