ఆదిలాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ) : కులవృత్తులకు ప్రోత్సాహం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఉపాధి లేకుండా పోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు ప్రోత్సహం అందించి అండగా నిలిచింది. గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలు, మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గొర్రెల పంపిణీ నిలిచిపోగా, చేపపిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.
ఏటా వానకాలంలో చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు చేరిన తర్వాత మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేయాలి. కానీ.. ఈ ఏడాది వానకాలం చివరి దశకు చేరుకున్న చేప పిల్లల పంపిణీ ప్రారంభంకాలేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు నిండాయి. చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు చేరిన తర్వాత చేప పిల్లలను వదిలితే పిల్లలు పెరిగి దిగుబడి అధికంగా వస్తుంది. జాప్యం కారణంగా నీరు వనరులు వట్టిపోవడం కారణఁగా పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నది. దీంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం నెలకున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం నీలి విప్లవంలో భాగంగా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఆదిలాబాద్ జిల్లాలో 95 మత్స్యకార సహకార సంఘాలు ఉండగా వీటిల్లో 4500 మంది సభ్యు లు ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నీలి విప్లవం లో భాగంగా ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్ల ల ఫలితంగా వీరికి ఉపాధి లభించింది. రెండేళ్ల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా లో 224 చెరువుల్లో 1.23 కోట్ల చేప పిల్లలను వదిలారు. సాత్నాల, మత్తడి ప్రాజెక్టులతోపాటు చెరువుల్లో వేసిన చేప పిల్లలు బాగా పెరిగాయి.
సకాలంలో పంపిణీ చేయడంతోపాటు మత్స్యకారులు చేపలు పట్టడానికి వలలు, ఇతర సామగ్రి, మార్కెటింగ్ కోసం ఫోర్, టూ వీల్లర్ వాహనాలను పం పిణీ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన త ర్వాత చేపపిల్లల పంపిణీ నీరుగారుతున్నది. ఈ ఏడాది 80 లక్షల చేప పిల్లలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. గతేడాది వానకాలం ముగిసిన త ర్వాత వదలడంతో నీటి వనరుల్లో నీరు ఎండిపో యి చేప పిల్లలు ఎదగలేదు. దీంతో మత్స్యకారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వం చే ప పిల్లలను సకాలంలో పంపిణీ చేస్తేనే ఉపా ధి లభిస్తుందని మత్స్యకారులు అంటున్నారు.
వడ్డాడి ప్రాజెక్టులో ఏటా చేపల పెంపకం చేపట్టి మత్స్యకార కుటుంబాలు ఉపాధి పొందుతాయి. ప్రాజెక్టులోకి నీరు వచ్చిన తర్వాత చేప పిల్లలను వేస్తే బాగా పెరిగి ఉపాధి లభిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా లక్ష చేప పిల్లలను పంపిణీ చేసేది. ఈ ఏడాది సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయలేదు. గతంలో రొయ్యలతోపాటు ఇతర చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈసారి రొయ్య పిల్లల పంపిణీ చేయడం లేదు. ప్రభుత్వం స్పందించి అన్ని రకాల చేపపిల్లల ను పంపిణీ చేసి మత్స్యకారులను ఆదుకోవాలి.
– ఎల్లుల పెంటన్న, మత్స్యకారుడు, వడ్డాడి, తాంసి మండలం