మంచిర్యాల, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాకు వానాకాలం సీజన్ కోసమని కేటాయించిన యూరియా పక్కదారి పట్టింది. మహారాష్ట్రతో పాటు పొరుగున ఉన్న ఆసిఫాబాద్ జిల్లాకు మన ఎరువులను తరలించి అధిక ధరలకు అమ్మేసుకోవడం అనేక అనుమనాలకు తావిస్తున్నది. వాస్తవానికి ఈ సీజన్ ప్రారంభంలో (జూన్, జూలై)నే కొన్ని మండలాలకు అవసరానికి మించి యూరియా సరఫరా చేయగా, ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ డీలర్లు, హాకా, డీసీఎంఎస్, ఆగ్రోస్ సెంటర్ల నిర్వాహకులు అధికారుల సాయంతో బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తున్నది.
ఇటీవల నెన్నెల మండలంలోని ఓ సెంటర్ నిర్వాహకులు యూరియాను ఇతర ప్రాంతాలకు తరలించగా, ఉన్నతాధికారుల స్థాయిలో పెద్ద ఎత్తున విచారణ జరిగింది. రైతులకు ఇచ్చిన యూరియాకు.. రికార్డుల్లో రాసిన బస్తాలకు పొంతన కుదర్లేదు. ఒక్కో రైతుకు రెండు బస్తాలు ఇచ్చి, 20 బస్తాలకు పైగా యూరియా ఇచ్చినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు.
ఇలా దాదాపు ఈ ఒక్క సెంటర్లోనే 48 టన్నుల యూరియాను మహారాష్ట్రకు తరలించినట్లు తెలిసింది. స్వయంగా వ్యవసాయ అధికారులే రైతులకు ఫోన్లు చేసి ఎన్ని యూరియా బస్తాలు తీసుకున్నారు.. ఎన్ని ఎకరాలు సాగు చేశారు.. మీకు అవసరం ఉన్న దాని కంటే ఎక్కువ యూరియా ఎందుకు తీసుకున్నారు.. అంటూ ప్రశ్నించడమేగాక.. ఆఫీస్‌కు వచ్చి వివరణ ఇవ్వాలంటూ హడలెత్తించారు. అసలు రైతులే కానీ వారి ఆధార్‌కార్డులు పెట్టి యూరియాను మాయం చేసినట్లు తెలిసింది.
ఇలా ఈ ఒక్క దగ్గరనే కాదు చెన్నూర్, కోటపల్లి, తాండూర్, భీమారం, జైపూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, లక్షెట్టిపేట ఇలా అనేక మండలాలకు కేటాయించిన యూరియాను డీలర్లు బ్లాక్ చేసి, ఎక్కువ ధరలకు బయటి మార్కెట్లలో అమ్మేసుకున్నారు. అవసరానికి మించి యూరియా కేటాయించకుండా కట్టడి చేయాల్సిన అధికారులే దగ్గరుండి మరీ కొన్ని మండలాలకు ఎక్కువ యూరియాను కేటాయించారు. ఈ తతంగంలో అధికారుల పాత్రపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెన్నెల మండలంలో జరిగినట్లే జిల్లా వ్యాప్తంగా యూరియా పక్కదారి పట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఎక్కువ యూరియా పంపిణీ చేసిన మండలాల్లో రైతులకు పంపిణీ చేసిన బస్తాలెన్ని.. రికార్డుల్లో వారి పేరుపై ఉన్న బస్తాలెన్ని.. విచారిస్తే అక్రమాలు బయటపడే అవకాశాలున్నాయి.
చెన్నూర్‌కు ఎక్కువ యూరియా..అక్కడే ఎక్కువ గడబిడ..
జిల్లాలో ఈ సీజన్లో చెన్నూర్ మండలంలో 30,220 ఎకరాల పంటలు సాగయ్యాయి. ఈ పంటలకు 2372 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 2995.34 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు. జూలైలో జిల్లాకు 8684.83 మెట్రిక్ టన్నుల యూరియా రాగా, చెన్నూర్ మండలానికే 1295.685 మెట్రిక్ టన్నులు కేటాయించారు. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నందుకో, ఎందుకో తెలియదు కానీ చెన్నూర్ మండలానికి 623.34 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా సరఫరా జరిగింది. కానీ, ఇప్పటికీ చెన్నూర్‌లోనే యూరియా కోసం రైతులు క్యూలు కడుతున్నారు. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ పంపిణీ చేసిన యూరియా ఏమైపోయింది.
పక్కదారి పట్టకుంటే రైతులు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారన్నది అర్థం కాకుండా పోయింది. ఒక్క చెన్నూర్ అనే కాదు బెల్లంపల్లి మండలానికి 855 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 1138 మెట్రిక్ టన్నులు , తాండూర్ మండలానికి 1607 మెట్రిక్ టన్నులు అవసరముంటే 1762 మెట్రిక్ టన్నులు, భీమారం 801 మెట్రిక్ టన్నులకు 1307 , మంచిర్యాల 75 మెట్రిక్ టన్నులకు గాను 535, లక్షెట్టిపేట 1132 మెట్రిక్ టన్నులకు 1268.82 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా సరఫరా జరిగింది. కానీ, ఏ ఒక్క దగ్గరా రైతులు సంతోషంగా లేరు. దీనికి కారణం అధికారుల వైఫల్యం కాక.. ఇంకేమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కరువైన పర్యవేక్షణ.. బలైపోయిన డీఏవో..?
జిల్లాలో ఈ సీజన్‌కు సంబంధించి జూన్, జూలై నెలల్లో అధికంగా యూరియా సరఫరా జరిగింది. ఆగస్టు నెలదాకా సరిపోయే యూరియా మనకు ముందే వచ్చింది. కానీ సరైన పర్యవేక్షణ లేకపోవడం, రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవడంతో యూరియా పక్కదారి పట్టంది. ఆగస్టు నెల దాకే యూరియా నిల్వలు ఉన్నాయని తెలసి కూడా ఆసిఫాబాద్, మహారాష్ట్రకు అక్రమంగా తరలించారు.
బెలంపల్లి, తాండూర్, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాలకు వచ్చి మరీ ఆసిఫాబాద్ రైతులు యూరియా తీసుకెళ్లారు. ప్రైవేట్ డీలర్ల నుంచి రూ.400 నుంచి రూ.450 చొప్పున బస్తాలు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. చెన్నూర్, కోటపల్లి ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు మన యూరియా పోయింది. దీనికి అడ్డుకట్ట వేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇంత పెద్దమొత్తంలో యూరియా తరలిపోతే కేవలం మూడు కేసులు మాత్రమే నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే జిల్లాలో ఎక్కువ యూరియా కేటాయింపులు జరిగిన సమయంలో మొన్నటి దాకా డీఏవోగా ఉన్న చత్రునాయక్ జిల్లాలోనే లేరు. ఆయన జూలై 16న బాధ్యతలు చేపట్టారు.
అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాస్తవానికి ఆయన ప్రత్యేక చొరవ తీసుకోవడంతోనే కొంత మేర యూరియా సరఫరా సాఫీగా జరిగింది. మూడు కేసులు కూడా ఆయనే బుక్ చేశారు. కానీ, జిల్లాకు 28,510 మెట్రిక్ టన్నుల అవసరముంటే ఇప్పటి దాకా 21,273 మెట్రిక్ టన్నుల సరఫరా జరిగింది. ఇంకా ఏడు వేల మెట్రిక్ టన్నుల కొరత ఉంది. కానీ గతంలో జరిగిన తప్పులకు ఆయన్ని బలిచేశారనే ఆరోపణలున్నాయి.
అటు ఉన్నతాధికారులు, ఇటు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రి నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక ఆయన లాంగ్‌లీవ్‌లో వెళ్లిపోయారనే గుసగుసలు వ్యవసాయశాఖ కార్యాలయంలో వినిపిస్తున్నాయి. జిల్లాకు ఇప్పటికీ ఏడు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. ఈ కొరతను భర్తీ చేయడంతో పాటు ఇప్పటి దాకా తప్పుదోవ పట్టిన యూరియాపై సమగ్ర విచారణ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.