సారంగాపూర్, జూలై 2 : ప్రతికూల పరిస్థితులను అధిమించి సాగు చేసిన రైతులు చివరకు పంట అమ్మిన డబ్బుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. మార్కెట్లో మొక్కజొన్న పంట విక్రయించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా.. డబ్బులు అన్నదాతల చేతికందలేదు. పంట డబ్బులు చేతికి రాక, చేతిలో చిల్లి గవ్వ లేక వానకాలం పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నారు. వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా పనిముట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక సతమతమవుతున్నారు. దాదాపు నెల రోజులు గడుస్తున్నా.. ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో వాటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సారంగాపూర్ మండలంలో యేటా రెండు పంటలు సాగు చేస్తారు. యేటా వానకాలంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు యాసంగిపై ఆధారపడుతుంటారు.
సారంగాపూర్ మండలంలోని కౌట్ల(బి), ఆలూర్ రెండు సొసైటీల ద్వారా మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మండల వ్యాప్తంగా 12,700 ఎకరాల్లో సాగు చేశారు. అయితే రెండు సొసైటీల ద్వారా 3,848 మంది రైతులకు 2,23,157 క్వింటాళ్ల పంటను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు ఎకరానికి 30 క్వింటాళ్ల పైనే దిగుబడి రాగా.. ఈ పంటను మార్కెట్లో విక్రయించగా ప్రభుత్వం మాత్రం ఎకరానికి 26.50 క్వింటాళ్లను కొనుగోలు చేసింది. 2047 మంది రైతులకు మాత్రమే రూ.2400 చొప్పున ఖాతాలలో డబ్బులు జమయ్యాయి. మిగతా 1801 మంది రైతులకు ఇప్పటి వరకు డబ్బులు జమకాలేదు. కొనుగోలు చేసిన వారం, పది రోజులకు ప్రభుత్వం డబ్బులు జమ చేయాలి. నెల రోజులు గడుస్తున్నా డబ్బులు చేరకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
రైతులు ప్రతి ఏటా ఖరీఫ్‌లో పండించిన పంటలకు సంబంధించి డబ్బులను అనేక మంది రైతులు వారి పాత బకాయిలు చెల్లించడం, ఇంట్లో రోజువారి ఖర్చులకు, పిల్లల స్కూల్ ఫీజులకు వినియోగిస్తుంటారు. మరుసటి ఏడాది పంట పెట్టుబడి కోసం ఎక్కువ మంది రైతులు రబీ పంటపైనే ఆధారపడుతుంటారు. యాసంగిలో వేసిన పంట అమ్మిన తరువాత వచ్చే డబ్బులను రానున్న ఖరీఫ్ సీజన్ కోసం వెచ్చిస్తుంటారు. మొక్కజొన్న పంట విక్రయించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా వాటికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావడం లేదు. దీంతో తాజా ఖరీఫ్ సీజన్ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, పిల్లల చదువులు, ఇతరత్రా పనిముట్లు కొనుగోలు చేసేందుకు రైతుల వద్ద డబ్బులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతరుల వద్ద వడ్డీ రూపేణ అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాకున్న పదెకరాల భూమిలో మొన్నజొన్న సాగు చేశా. 300 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నలబై రోజుల క్రితం సారంగాపూర్ మార్కెట్ యార్డులో రెండు దశల్లో పంట అమ్ముకున్నా. సుమారు రూ.7.20 లక్షల డబ్బులు ఖాతాలో జమ కాలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నది. పంట అమ్మిన డబ్బులు రాకపోవడంతో పెట్టుబడికి, ఇతర ఖర్చులకు నష్టంగా ఉంది. ప్రభుత్వం తన ఖాతాలో డబ్బులు జమ చేయాలి. లేదంటే ఖరీఫ్ పంటలు సాగు చేయడం కష్టం.
– నారాయణ నాయక్, రైతు, నాగాపూర్.
మూడున్నర ఎకరాల భూమి కౌలుకు తీసుకొని మొక్క జొన్న సాగు చేశా. అయితే 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రెండు నెలల క్రితం పొన్కూర్(స్వర్ణ) మా ర్కెట్లో 70 క్వింటాళ్ల పంటను విక్రయించా. మిగతా 30 క్వింటాళ్ల పంటను మార్కెట్ వారు కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపా రులకు తక్కువ ధరకు రూ.1700ల చొప్పున అమ్మేశా. దీంతో నాకు రూ. 21 వేల నష్టం వచ్చింది. అలాగే ప్రభుత్వానికి అమ్మిన 70 క్వింటాళ్ల మొక్క జొన్న పంటకు సంబంధించిన రూ.1.68 లక్షల డబ్బులు ఇప్పటి వరకు ఖా తాలో జమ కాలేదు. ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు, పనిముట్లు, పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులు వంట పెట్టుబడి కోసం డబ్బులు లేకపోవడంతో తీ వ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దీంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారింది. ప్రభుత్వం, అధికారులు స్పందించి త్వరగా డబ్బులు జమ అయ్యేలా చొరవ తీసుకోవాలి.
– డోలు ప్రవీణ్, కౌలు రైతు, పొన్కూర్(స్వర్ణ)