బజార్హత్నూర్, నవంబర్ 13 : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలో కంది(తొగరి) 1230 ఎకరాల్లో సాగైంది. నల్లరేగడి భూములు అధికంగా ఉండడంతో దేగామ, బజార్హత్నూర్, వర్తమన్నూర్, గిర్నూర్, పిప్పిరి భోస్రా, దిగ్నూర్ గ్రామాల్లో అంతర పంటగా వేశారు. ఈ వానకాలంలో రైతులు ప్రధానంగా సోయా, మొక్కజొన్న, పత్తి ప్రధానంగా సాగు చేస్తారు. ఇందులో కందిని అంతర పంటగా వేస్తారు. సోయా, మొక్కజొన్న పంటలు మూడు నెలల్లోనే కోతకు రావడంతో కంది పంటను చీడపీడలు ఆశించకుండా రక్షిస్తున్నారు.
జూన్, జూలై నెలల్లో విత్తుకున్న కంది 160 నుంచి 180 రోజుల్లో కోతకు వస్తుననది. ఈ ఏడాది అక్టోబర్లో కురిసిన వర్షాలకు పంట ఏపుగా పెరిగి ప్రస్తుతం పూత, కాత దశలో ఉన్నది. వాతావరణం అనుకూలించడంతో అధిక దిగుబడి వస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.