చెన్నూర్ రూరల్, ఆగస్టు 14 : యూరియా కోసం రైతులు కన్నెర్ర చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని పీఏసీఎస్ వద్ద ధర్నా చేయగా, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. రైతులు ఎరువుల కోసం క్యూలైన్లో చెప్పులు పెట్టి గంటల తరబడి వేచి చూశారు. వందల మంది ధర్నా చేస్తే 260 మందికి యూరియా ఇవ్వడం ఏమిటని మండిపడుతూ ఆందోళనకు దిగారు. చెన్నూర్ సీఐ దేవేందర్, ఎస్ఐలు సుబ్బారావు, శ్యాం పటేల్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి ఎరువుల పంపకాన్ని ప్రారంభించారు. మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రేవల్లి మహేశ్, ఏడీఏ ప్రసాద్, ఏవో యామిని ఉన్నారు.
భీమిని, ఆగస్టు 14 : వెంకటాపూర్‌లో యూ రియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని జై భీమ్ పరస్పర సహకార సంఘం ద్వారా 266 బస్తాలు వస్తే గ్రామం లో ఒక్కటి కూడా పంచి పెట్టలేదని రైతులు మండిపడ్డారు. పిచికారీ మందులను కొంటే నే యూరియా బస్తాలు ఇస్తామని చెప్ప డం తో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి ఎస్ఐ భాస్కర్‌రావు చొరవ తీసుకుని గొడవ సద్దుమణిగించారు. రూ. 350 ఇస్తేనే బస్తా ఇస్తామంటూ సొసైటీ సభ్యులు చెప్పడంతో రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. నిర్ణ యించిన ధరలకే యూరియాను విక్రయించా లని, లేదంటే చర్యలు తప్పవని ఏడీఏ సురేఖ తెలిపారు. ఏవో యమున దుర్గ ఉన్నారు.