ఆదిలాబాద్, జనవరి 15(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రకటించిన రైతుభరోసా పథకం సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసాలో భాగంగా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత మాట మార్చి ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని ప్రకటించింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఈ నెల 26 నుంచి అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములను గుర్తించడానికి అధికారులు నేటి(గురువారం) నుంచి గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈనెల 20 వరకు భూముల గుర్తింపు ప్రక్రియ నిర్వహించనుండగా.. 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామసభలు ఏర్పాటు చేసి అనర్హుల జాబితాను ప్రదర్శిస్తారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. భూ భారతి(ధరణి) పోర్టల్‌లో నమోదై ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు అందించనున్నారు. ఇండ్లు, కాలనీలుగా మారిన భూములు, లే అవుట్లు, రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలు, గోదాములు, మైనింగ్‌కు ఉపయోగించేవి, రాళ్లు, రప్పలు, గుట్టలతో నిండి సాగుకు అనుగుణంగా లేని భూములకు రైతు భరోసా వర్తించదు.
వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములను గుర్తించడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, వ్యవసాయ శాఖ ఏఈవోలు ఈ ప్రక్రియకు టీం లీడర్లుగా వ్యవహరిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో 509 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. గ్రామాలవారీగా భూముల గుర్తింపు ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రతి గ్రామ పట్టాదారు పాసు పుస్తకాల జాబిజాతోపాటు విలేజ్, గూగుల్ మ్యాప్ సహాయంతో గ్రామాల్లో పర్యటించి భూములను పరిశీలిస్తారు. అనంతరం మండల తహసీల్దార్, వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోని సర్వే నంబర్లను పరిశీలించి సాగులో లేని భూములను నిర్ధారిస్తారు. ఇలా గుర్తించిన వాటిని గ్రామసభలో వినిపించి ఆమోదం తీసుకుంటారు. వ్యవసాయంలో లేని భూముల జాబితాను పోర్టల్‌లో నమోదు చేసి డిజిటల్ సంతకంతో తొలిగిస్తారు.
రైతు భరోసా పథకం విషయంలో రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం రూ.2 లక్షల రుణమాఫీ మాదిరి కాకుండా సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఎన్ని ఎకరాలున్నా అందించాలని కోరుతున్నారు. జిల్లాలో రూ.2 లక్షల రుణమాఫీ కాని రైతులు దాదాపు 30 వేల వరకు ఉంటారు. జిల్లాలో 509 రెవెన్యూ గ్రామాల్లో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులు 1.63 లక్షలు ఉండగా.. 5.78 లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున ప్రతి సీజన్లో రూ.280 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో భాగంగా మొదట ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని మాట తప్పి ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామంటుందని, నామ్‌కే వాస్తేగా కాకుండా అర్హులైన రైతులందరికీ ఈ సాయం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఇండ్లు, కాలనీలుగా మారిన భూములు, లే అవుట్లు, రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలు, గోదాములు, మైనింగ్‌కు ఉపయోగించేవి, రాళ్లు, రప్పలు, గుట్టలతో నిండి సాగుకు అనుగుణంగా లేని భూములు.