పెంబి, మే 27 : 45 ఏండ్ల నుంచి పోడు భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, మా భూములను లాక్కోవద్దని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇటిక్యాల గ్రామ శివారులో దాదాపు 78 ఎకరాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 మంది రైతులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎఫ్ఆర్వో రమేశ్రావు మంగళవారం సిబ్బందితో కలిసి పోడు భూముల్లో మొక్కలు నాటడానికి చర్యలు తీసుకున్నారు.
విషయం తెలుసుకున్న రైతులు తమ భూముల్లో మొక్కలు నాటడానికి కందకాలు తవ్వుతుండగా అడ్డుకున్నారు. తవ్విన కందకాల్లో పడుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోడు పట్టాలు ఇవ్వడానికి సర్వే చేశారని, ఇప్పుడు అటవీ అధికారులు భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వో రమేశ్రావు, డీఆర్వో ప్రతాప్ నాయక్, ఎఫ్బీవోలు కిరణ్, స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.
కడెం, మే 27: అటవీ అధికారులు అక్రమంగా తమ భూములు లాక్కునే ప్రయత్నాలను మానుకోవాలని రైతులు హెచ్చరించారు. నవాబుపేట గ్రామ శివారులోని సర్వే నంబర్ 110లో మంగళవారం అటవీ అధికారులు కందకాలు తవ్వి బౌండరీలను ఏర్పాటు చేసే విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకున్నారు. ఏళ్ల పోరాటాల ద్వారా తాము భూములను దక్కించుకున్నామని, మాకు పట్టాలు ఉండగా అధికారులు భూములను తిరిగి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
కలెక్టర్, అప్పటి ఎమ్మెల్యే, తహసీల్దార్ ద్వారా మాకు అటవీ హక్కు పట్టాలు ఇచ్చారన్నారు. మా భూములను తిరిగి అధికారులు తీసుకునే ప్రయత్నాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. దీంతో అధికారులు పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తిరిగి వెళ్లిపోయినట్లు ఎఫ్ఆర్వో గీత తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సిద్ధార్థ పాల్గొన్నారు.