ఆదిలాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకున్నది. వానకాలం సీజన్ ప్రారంభం కాగా రైతులు విత్తనాలు వేసి 20 నుంచి 25 రోజులు కావస్తున్నది. సీజన్ ప్రారంభం నుంచి సాగుకు వర్షాలు అనుకూలిస్తుండడంతో మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో రైతులు దిగుబడిపై ఆశలు పెట్టుకున్నారు. పంటల ఎదుగుదలకు కావాల్సిన ఎరువులను తీసుకురావడానికి విక్రయ కేంద్రాలకు వెళ్తున్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రాథమిక సహకార కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలతోపాటు ప్రైవేటు వ్యాపారులు రైతులకు ఎరువులను విక్రయిస్తున్నారు. అన్నదాతలు ఎరువుల కోసం విక్రయ కేంద్రాలకు వెళ్తే సరిపడా లభించడం లేదు. పలు సహకార కేంద్రాల్లో ఎరువుల నిల్వలు అయిపోవడంతో మూసివేయగా, ఆదిలాబాద్ పట్టణానికి రావాల్సి వస్తున్నది. ఇక్కడ దుకాణాల్లో రద్దీ నెలకున్నది. దీంతో రైతులు ఎరువుల కోసం తిరుగాల్సి వస్తున్నది.
తలమడుగు మండలంలోని పల్లి(బీ),పల్లి(కే), దేవాపూర్ గ్రామాలకు చెందిన దాదాపు 50 మంది రైతులు మంగళవారం ఎరువుల కోసం ఆధార్ కార్డులను క్యూలో పెట్టి బారులుదీరారు. పీఏసీఎస్ గోదాములో సరిపడా యూరియా లేదు. దీంతో ఒక్కో ఆధార్ కార్డుదారుకు ఐదు బస్తాల చొప్పున ఇచ్చారు. కొందరికి అందకపోవడంతో వెనుదిరిగారు. ఆధార్‌కార్డులను క్యూలో పెట్టి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. మండల వ్యవసాయ శాఖాధికారి ప్రమోద్‌రెడ్డి పల్లి(బీ) గ్రామంలోని పీఏసీఎస్ గోదామును సందర్శించగా సరిపడే ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. మండలంలో పీఏసీఎస్ ద్వారా ఐదు సబ్ సెంటర్లు తలమడుగు, సుంకిడి, ఝరి, భరంపూర్, పల్లి(బీ) సెంటర్లలో ఎరువులు అందిస్తున్నామని తెలిపారు.
బోథ్‌లోని సహకార సంఘం గోదాం వద్ద యూరి యా కోసం రైతులు బారులుదీరారు. ప్రస్తుతం పత్తి, సో యా పంటలకు యూరియా అవసరం. దీంతో రైతులు యూరియా కోసం సొసైటీ కార్యాలయాలకు వెళ్తున్నారు. ఆధార్ కార్డులు చేత పట్టుకుని బారులుదీరుతున్నారు.
సిరికొండ మండలంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో రైతులకు యూరియా, డీఏపీలను మంగళవారం పంపిణీ చేశారు. రైతులు ఉదయమే పెద్ద ఎత్తున తరలివచ్చారు. యూరియా ఐదు బస్తాలు ఇవ్వాల్సి ఉండగా మూడు బస్తాలు ఇస్తున్నారు. డీఏపీ అందుబాటులో లేదని రైతులు వాపోతున్నారు. డీఏపీ, యూరియా కోసం సహకార సంఘం వద్ద బారులు తీరుతున్నామన్నారు. యూరియా బస్తాలు సరఫరా చేసి కొరత లేకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో 5.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ఎక్కువగా పత్తి 4.40 లక్షలు, సోయా 65 వేలు, కంది 55 వేలు, మక్క 23 వేల ఎకరాల్లో సాగువుతాయని అధికారులు నివేదికలు తయారు చేశారు. సీజన్లో 92 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల వినియోగం అవుతాయని అంచనా వేశారు. వీటిలో ఎక్కువగా యూరియా 35 వేలు, కాంప్లెక్స్ ఎరువులు, 36 వేలు, డీఏపీ 13 వేలు, ఎంవోపీ 7 వేలు, ఎస్ఎస్పీ 4 వేల మెట్రిక్ టన్నుల వినియోగం అవుతాయని గుర్తించారు. ప్రస్తుతం పత్తి పంటకు రైతులు డీఏపీని ఎక్కువగా వినియోగిస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు దుకాణాలకు డీఏపీ సరఫరా కావడం లేదని జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వ్యాపారులు తెలిపారు. దీంతో దుకాణదారులు రైతులకు ప్రత్యామ్నాయ ఎరువులను విక్రయిస్తున్నారు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో 20-20-0-13 ఎరువులను కొనుగోలు చేస్తున్నారు.
నేను పదెకరాల్లో పత్తి వేశా. 25 రోజుల కిందట వేసిన విత్తనాలు మొలకెత్తి మొక్కలు బాగా పెరుగుతున్నాయి. ఎదుగుదల కోసం ఎరువులు అవసరం. కాగా తలమడుగు మండలం కేంద్రంతోపాటు ఝరి, కుచులాపూర్, తాంసి విక్రయకేంద్రాలకు వెళ్తే మూసి ఉన్నాయి. దీంతో ఆదిలాబాద్‌కు వచ్చి ఎరువులు కొనుగోలు చేస్తున్నా. ఇక్కడ కూడా డీఏపీ లేదు. ఇతర ఎరువులు కొనుగోలు చేయాలని దుకాణదారులు సూచిస్తున్నారు. మందు బస్తాల కోసం తిరగడంతో ఖర్చు బాగా అవుతుంది. పంటకు అవసరమైన సమయంలో ఎరువులు వేయకపోతే నష్టపోవాల్సి వస్తుంది.
– నారాయణ, రైతు, సాయిలింగి, తలమడుగు
నేను 15 ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు వేశా. ఎరువుల కోసం ఆదిలాబాద్ ప్రైవేటు దుకాణాలకు వస్తే డీఏపీ లేదని అంటున్నారు. యూరియా కూడా తమ అవసరాల మేరకు ఇవ్వడం లేదు. డీపీపీ బదులుగా 20-20-0-13 కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ మందును యూరియాతో కలిపి పంటకు వేయాల్సి ఉంటుంది. పత్తి పంటకు ఎప్పుడూ డీపీపీ వినియోగిస్తాం. అధికారులు రైతులకు అవసరమైన ఎరువులను పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
– నర్సింగ్, రైతు, భీంసరి, ఆదిలాబాద్ రూరల్ మండలం
ప్రతి రైతుకు పాసు పుస్తకం, ఆధార్ కార్డు ఆధారంగా ఐదు యూరియా బస్తాలు ఇవ్వాల్సి ఉండగా కొరత ఉందని మూడు బస్తాలు ఇస్తున్నారు. దీంతోపాటు డీఏపీ అందుబాటులో లేదని చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం దృష్ట్యా యూరియా, డీఏపీ అత్యవసరం. అధికారులు ఫర్టిలైజర్ షాపులతో కుమ్మక్కై కొరత విధిస్తున్నట్లు అనుమానం ఉంది.
– పెందుర్ బండు, లచ్చింపూర్, సిరికొండ మండలం