“కాంగ్రెస్‌ను నమ్మి ఒటేస్తే నట్టేట ముంచింది. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తమన్నది.. రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలిస్తమని చెప్పి మోసం చేసింది. అసలు గీ ప్రభుత్వ పథకాలేమిటో అర్థమైతలేదు. అప్పుడేమో రైతుల మీద ప్రేమున్నట్లు అన్నీ ఇస్తమని చెప్పింది. ఇప్పుడేమో సర్వేలంటూ సాగదీస్తున్నది. గింత వరకూ ఏ ఒక్క పథకం ఇచ్చింది లేకపాయే. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు కొండంత ధైర్యం ఉండే. గిసొంటి గోస లేకుండే. సకాలంలో రైతులందరికీ రైతు బంధు కింద పంట సాయమందించిండు. రుణమాఫీ చేసిండు. రంది లేకుంట ఎవుసం చేసుకొని బతికినం.’ మళ్లా బీఆర్ఎస్ సర్కారే వస్తది. మాకు మంచి రోజులొస్తయి.” అని ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ పర్యటించిన సందర్భంగా పలువురు రైతులు ‘నమస్తే తెలంగాణ’తో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటైన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ అన్నదాతల్లో ఆత్మైస్థెర్యం నింపిందని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కొండంత అండగా నిలిచిందని తెలిపారు.
– మంచిర్యాల, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఎవరికీ రాలే..
భీంపూర్, జవనవరి 27 : అసలు మాకు కాంగ్రెస్ సర్కారు పథకాలే అర్థం కావడం లేదు, ఆత్మీయ భరోసా అనేది భూమి లేని పేదలకు. న్యాయంగా నైతే అర్హులందరికీ ఇవ్వాలి. అందరికీ ఇయ్యలేక ఈ పథకానికి ఉపాధి పనులకు 2023ల 20 రోజులైనా వెళ్లాలని నిబంధన పెట్టారు. దీంతో మా గ్రామంల ఎందరో మంది పేదలకు ఈ పథకం అందే అవకాశం లేదు . ఈ పథకం చిన్న సన్నకారు రైతులకు ఇస్తే మేలు జరిగేది. ఇగ రైతుభరోసా 26 జనవరి అర్ధరాత్రి నుంచి ఇస్తమన్నారు. ఎవరికీ రాలేదు. అది ఇస్తారన్న నమ్మకం లేదు. గ్రామంలా ఇందిరమ్మ ఇండ్లకు ఎందరు దరఖాస్తు పెడితే అందరి పేర్లు లిస్టుల ఉన్నయి. ఆఖరికి ఇచ్చేదెందరికో.? ఇపుడు మండలానికి ఒక్క గ్రామంలనే ఐదు, పది మాత్రమే రేషన్ కార్డులిచ్చిండ్రు. వీటిపై ఇప్పుడే బియ్యం ఇస్తరన్న నమ్మకం లేదు. ఇగ మొన్న బీఆర్ఎస్ అధ్యయన కమిటీ అచ్చినంక మాకే గాదు గ్రామంలా అందరికీ కొంత ధైర్యం అచ్చింది. మళ్లా బీఆర్ఎస్ సర్కారే వచ్చేలా ఉన్నది.
– విఠల్, రైతు, యాపల్‌గూడ, ఆదిలాబాద్ రూరల్ మండలం
బీఆర్ఎస్ అధ్యయన కమిటీతో ధైర్యం..
భీంపూర్, జనవరి 27 : జైనథ్ మండలం గిమ్మ నుంచి మేము చాలామంది రైతులం యాపల్గూడకు వచ్చి బీఆర్ఎస్ అధ్యయన కమిటీ నాయకులతో మా ఇబ్బందులు చెప్పుకున్నాము. మా గ్రామంల 1422 మంది రైతులు పంటరుణాలు తీసుకున్నరు. మొత్తంగా 392 మందికే రుణమాఫీ చేశారు. మిగతా రైతులంతా పరేషాన్ అవుతున్నరు. ఇక మా గ్రామంలా భూమి లేని నిరుపేదలకు ఒక్కరికీ ఆత్మీయ భరోసా జాబితాలో పేరు రాలేదు. వారు ప్రభుత్వం సూచించిన 2023లో 20 రోజుల ఉపాధి పనులకు వెళ్లలేదని ఇలా చేశారు. భూమి లేని నిరుపేదలు అనారోగ్యంతో ఉన్నా.. ఇంకా ఏవైనా పనులున్నా ఉపాధి పనులకు వెళ్లడం కష్టమైతది. ఆత్మీయ భరోసాకు ఉపాధి హామీ పథకానికి లింకు ఏమిటో అర్థం కావడం లేదు. ఈ రకంగా కాంగ్రెస్ సర్కారుతోని రైతులు, కూలీలకు ఎదురవుతున్న కష్టాలను మేము అధ్యయన కమిటీ వారికి చెప్పినం. యాపల్‌గూడ, రామాయి గ్రామాల్లో పంట చేలకు వెళ్లి ఓపికగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు అండగా ఉంటామని మాజీ మంత్రి జోగురామన్న, నాయకులు చెప్పిన మాటలు మాకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఎట్లాగూ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని నమ్మకం కలిగింది.
– కోల భోజన్న , గిమ్మ, జైనథ్ మండలం
బీఆర్ఎస్ లీడర్లు మా బాధలు తెలుసుకున్నరు..
భీంపూర్, జనవరి 27 : కాంగ్రెస్ సర్కారు వచ్చినంక మా కుటుంబానికి ఏ పథకం రాలే. నేను చిన్న రైతును. 3 ఎకరాల్లో సాగు చేసుకుంటూ బతుకుతున్న. ఆదిలాబాద్ మహారాష్ట్ర బ్యాంకులో రూ. 2.40 లక్షల పంట రుణం ఉన్నది. రెన్యువల్ చేసినం. ఇగ రూ.2 లక్షల లోపల ఉన్న మస్తుమంది రైతులకు మాఫీ కాలేదు. మాకు అయితదనే నమ్మకం లేదు. రైతుభరోసా వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబితే తెల్లారే దాకా చూసిన రాలేదు. కేసీఆర్ సారు ఉన్నప్పడు రైతు బంధు సాయాన్ని పంటలు సాగు చేసే టైంకి జమ చేసిండు. రైతుబంధు వస్తదనే నమ్మకంతోటి ఊళ్లళ్ల అప్పులు పుట్టేవి. ఇప్పుడు పెట్టుబడికి ఇబ్బందిగా మారింది. మొన్న యాపల్గూడకు బీఆర్ఎస్ లీడర్లు వచ్చిండ్రు. మా బాధలు తెలుసుకున్నరు. రైతులందరికీ మేమున్నామని ధైర్యం ఇచ్చిండ్రు.
– భగవాండ్లు, యాపల్‌గూడ, ఆదిలాబాద్ మండలం
రైతుభరోసా రాలే
భీంపూర్, జనవరి 27 : కాంగ్రెస్ సర్కారు ఇగ ఎట్లయినా 26 జనవరి అర్థరాత్రి నుంచి రైతుభరోసా పైసలు వస్తయి. ఫోన్లు టింగు టింగు మంటయి అని సీఎం సారు టీవీల చెబితే నమ్మినం. నాతో పాటు మా గ్రామంల రైతులంతా రాత్రి బారాబజే నుంచి ఫోన్ల డబ్బులు జమైనట్లు మెస్సేజ్‌ల కోసం ఎదురు చూసినం. తెల్లారే దాకా చూసినా మెస్సేజ్‌లు రాలే. ఇట్లా ఊకూకె మాట మార్చేటి సర్కారు మీద మేమంతా నారాజ్గానే ఉన్నము. రైతు, కూలీ ఇతరులందరికీ ఈ సర్కారు పద్ధతి నచ్చడం లేదు. మొన్న బీఆర్ఎస్ నాయకులు వచ్చి మేమున్నము అని ధైర్యం ఇచ్చిండ్రు.
– గెడాం లక్ష్మణ్, అంతర్గాం, భీంపూర్ మండలం
బీఆర్ఎసోళ్లు ధైర్యం చెప్పిండ్రు..
బేల, జనవరి 27 : కాంగ్రెసోళ్లు రైతులను నమ్మించి ముంచిండ్రు. ఎలక్షన్ టైంలో అది చేస్తాం ఇది చేస్తాం అని.. చివరకు నమ్మించి మోసం చేయడమే కాకుండా.. గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఆశలు పెట్టడం తప్ప ఏం చేసుడు లేదు. కానీ చనిపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ వాళ్లు మా ఊరికి వచ్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పిండ్రు. వచ్చే ఎలక్షన్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం. రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే.
– శంకర్, రైతు, రేణిగూడ గ్రామం, బేల మండలం
రుణ మాఫీ కాలే.. మాకు పైసా రాలే
బేల, జనవరి 27 : ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి రూ.2 లక్షల రుణమాఫీ మాకు ఇంకా కాలేదు. నాకు రూ.2 లక్షల పైగా అప్పు ఉంది. రుణమాఫీ కాకపోవడంతో బ్యాంక్ అధికారులు సతాయిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇస్తానన్న పథకాలు మాకు ఇయ్యాలి. రైతు భరోసా కింది రూ.15 వేలు ఇస్తామని ఎగ్గొట్టిండు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇస్తామని ఇయ్యలే. కేసీఆర్ సారే బాగుండే మాకు. బీఆర్ఎస్ కమిటీ వచ్చి ఆత్మహత్య రైతు చేసుకున్న కుటుంబాన్ని ఓదార్చి లక్ష రూపాయలు ఇచ్చి అండగా నిలిచిండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏమీ ఇయ్యలే.
– హాన్ దశరథ్, రైతు, రేణుగూడ, బేల మండలం
రైతుల బాధలు తెలుసుకున్నరు..
బేల, జనవరి 27 : బీఆర్ఎస్ పార్టీ అధ్యయన కమిటీ మా గ్రామానికి చెందిన రైతు జాదవ్ దేవ్‌రావ్ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యాన్నిచ్చింది. గ్రామంలోని రైతులందరి బాధలను అడిగి తెలుసుకున్నది. అప్పులు అందరికీ ఉంటాయి. ధైర్యంతో ముందుకు సాగాలని చెప్పింది. బీఆర్ఎస్ అధ్యయన కమిటీ మా గ్రామ రైతులందరికీ ధైర్యాన్నిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా మాకు ఏం ఇయ్యాలే. ఇస్తదని భరోసా కూడా లేదు. రైతుల గోస తెలిసిన నాయకుడు కేసీఆర్ ఒకడే ఉండే. ఇప్పుడు ఇగో ఇస్తాం.. అగో ఇస్తాం అని.. ఆశ చూపెట్టి రైతులకు మోసం చేస్తున్నరు. నాకు 4 ఎకరాల భూమి ఉంది. నాకు ఒక రూపాయి కూడా రాలే.
– విఠల్ రైతు, రేణిగూడ గ్రామం, బేల మండలం
ఈ సర్కారుతో అరిగోస పడుతున్నం..
భీంపూర్, జవనవరి 27 : మాకు 3 ఎకరాల భూమి ఉన్న ది. పత్తి, కంది సాగు చేస్తున్నం. కేసీఆర్ సారు ఉండగా మాకు గానీ.. తోటి రైతులకు గానీ ఏ రంది (బాధ) లేకుండే. అప్పుడు మేము పంట పెట్టుబడికి బాకీలు తెచ్చుడే మర్చిపోయినం. ఇప్పుడు మళ్లా దళారుల దగ్గరికే పోతున్నం. ఇపుడున్న కాంగ్రెస్ సర్కారుతో రైతులకు అరిగోస అవుతున్నది. మొన్నటి ప్రజాపాలన, సర్వేలు మాకు విసుగు తెప్పిస్తున్నాయి. పోనీ ఇన్నిసార్లు సర్వేలు చేసి ఏమన్నా పథకాలు ఇస్తున్నరా అంటే అదీ లేదు. మా కుటుంబానికి కొత్తగా ఏ పథకాలు అందలేదు. ఆఖరికి రైతుభరోసా కూడా రాలే. గీ సర్కారుతో చిన్న రైతులకు ఇంకా కష్టమవుతున్నది. ఇగ ఇప్పడందరూ అప్పటి కేసీఆర్ సార్ పాలననే మంచిగా ఉండే అని గుర్తుకు తెచ్చుకుంటున్నరు.
– పాలెపు అశోక్, రైతు, యాపల్‌గూడ , ఆదిలాబాద్ రూరల్ మండలం