ముంబై : ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎమ్సీఏ) మరో వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ఇప్పటికే పురుషుల టీ20 లీగ్ ద్వారా దేశ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన ఎమ్సీఏ తాజాగా తొలిసారి మహిళల లీగ్‌కు సిద్ధమైంది. దేశంలో మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుంటూ ఎమ్సీఏ అరంగేట్రం టీ20 లీగ్ ద్వారా ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా సోమవారం రెండు టోర్నీలకు సంబంధించిన ట్రోఫీలను టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్‌శర్మ ఆవిష్కరించాడు.
ఈ కార్యక్రమంలో ముంబై క్రికెటర్ సయాలీ సత్గరెతో పాటు ఎమ్సీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్, అశిష్ షెలార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ‘క్రికెట్ అభివృద్ధి కోసం ఎమ్సీఏ చేస్తున్న కార్యక్రమాలపై సంతోషంగా ఉన్నాను. కేవలం ఐపీఎల్ ద్వారానే కాకుండా టీ20 ముంబై లీగ్ ద్వారా మరింత మంది యువ ప్లేయర్లకు అవకాశం కల్పిస్తున్నది. ముంబై టీ20 లీగ్‌లో ఆడిన ప్లేయర్లలో చాలా మంది ఐపీఎల్‌తో పాటు జాతీయ జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు’ అని అన్నాడు.