గులాబీ అధినేత కేసీఆర్ హయాంలో హైదరాబాద్లోని రవీంద్రభారతి తరహాలో నిర్మించిన మహతి ఆడిటోరియం నేడు నిరుపయోగంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించిన అధికారులు ఇప్పుడు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహతి ఆడిటోరియాన్ని వాడుకలోకి తీసుకురాకపోవడంతో వృథాగా ఉన్నది.
గజ్వేల్, మార్చి 16: గులాబీ అధినేత కేసీఆర్ కృషి ఫలితంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మూట్రాజ్పల్లి మార్గంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.20కోట్లు ఖర్చు చేసి నిర్మించిన మహతి ఆడిటోరియాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపయోగంగా మార్చింది.దీంతో పట్టణవాసుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కళలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం వినియోగించేలా అద్భుతంగా నిర్మించారు.
మహతి ఆడిటోరియం నిర్వహణ సక్రమంగా లేక అధ్వానంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లా సమావేశాలు, రాజకీయ పార్టీ సమావేశాలు నిర్వహించడం వల్ల వాడుకలో ఉండేది. కానీ ఇప్పుడు అధికారులు మహతి ఆడిటోరియాన్ని పట్టించుకోవడం లేదు. వాడుకలో లేక అందులోని ఫర్నిచర్ రిపేర్ దశకు చేరుకునేలా ఉంది. గతంలో ఇక్కడే జిల్లా సమీక్షలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ప్రైవేట్ కార్యక్రమాలు కూడా ఇదే వేదికపై ఎన్నో నిర్వహించారు.
అద్దెకు తీసుకొని వివిధ కార్యక్రమాల నిర్వహణ అద్భుతంగా చేపట్టారు. ప్రైవేట్ పాఠశాల, కళాశాలలకు సంబంధించిన వెల్కమ్, ఫేర్వెల్ పార్టీలు నిర్వహించేవారు. గతంలో మహతి ఆడిటోరియాన్ని శుభకార్యాలయాల నిర్వహణకు అద్దెకు ఇవ్వడంతో కొద్ది రోజుల పాటు నడిపించిన నిర్వాహకులు వంట గది, అందులో సామగ్రి లేకపోవడంతో కొద్ది కాలనికే వదులుకున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు మహతి ఆడిటోరియాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పట్టణవాసులు కోరుతున్నారు.