రఘునాథపాలెం, జూలై 26: ఖమ్మం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన జనం.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మార్పులు చోటు చేసుకొని వర్షం పడడంతో హర్షం వ్యక్తం చేశారు.
కాగా, తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరుణుడి రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న రైతులకు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం కూసింత ఊరటనిచ్చింది. జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడి చిన్నపాటి వర్షం కురవడంతో అన్నదాతలకు, జిల్లా ప్రజలకు కొంత ఉపశమనాన్ని కలిగించింది. అయితే, పెద్ద ఎత్తున వర్షం కురుస్తుందని అన్నదాతలు ఊహించినప్పటికీ ఫలితం లేకపోయింది. తేలికపాటిగా వర్షం కురిసి ఆగిపోవడంతో కొంత నిరాశ చెందారు.