‘ప్రేక్షకుల్ని వందశాతం మెప్పించే సినిమా ఇది. ఇందులోని ప్రతి పాత్రనూ రియలిస్టిక్‌గా రాశారు దర్శకుడు అజయ్‌భూపతి. ఓ మంచి కథ ద్వారా పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది.’ అని సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, చిత్ర కథానాయకుడు జయకృష్ణ అనందం వెలిబుచ్చారు. ఆయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాసమంగాపురం’. రషా తడానీ కథానాయిక. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ సమర్పణలో పి.కిరణ్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా రిలీజ్ ప్రెస్మీట్లో హీరో జయకృష్ణ మాట్లాడారు. తెలుగులో ఈ తరహా మేకింగ్ సినిమాలు రావడం అరుదు అని, మహేశ్‌బాబులా జయకృష్ణ కూడా పెద్ద స్టార్ అవుతారని, మోహన్‌బాబు, నరేశ్ పోషించిన పాత్రలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు అజయ్ భూపతి నమ్మకంగా చెప్పారు. ఇంకా నరేశ్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ వడ్లమాని, డీవోపీ జైకృష్ణ కూడా మాట్లాడారు.
‘నేను, అల్లు అర్జున్, రామ్‌చరణ్ వైజయంతీ సంస్థ ద్వారానే హీరోలుగా పరిచయం అయ్యాం. అలాంటి గొప్ప సంస్థ ద్వారా మా జయకృష్ణ కూడా వెండితెరకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం మా కుటుంబమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ట్రైలర్, పాటలు బావున్నాయి. ముఖ్యంగా ‘అలెల్లే అలెల్లే..’ సాంగ్ నాకు బాగా నచ్చింది. నటీనటుల్ని దర్శకుడు అజయ్‌భూపతి చాలా బాగా చూపించారు. తెరకు పరిచయం అవుతున్న జయకృష్ణ, రషా తడానీలకు అభిమానులు ప్రోత్సాహం అందించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అంటూ ‘శ్రీనివాస మంగాపురం’ టీమ్‌కి అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు తన ఎక్స్ ద్వారా ‘ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు.