ఇదం మృష్ట మిదం నేతి యోశ్నన్నపి న సజ్జతి
హితం సత్యం మితం వక్తి త మజిహ్వం ప్రచక్షతే॥
(నారద పరివ్రాజక ఉపనిషత్తు . 3-63)
‘ఎవ్వడు తినేటప్పుడు ‘ఇది రుచి కలిగినది, ఇది రుచి లేనిది’ అని ఆలోచించడో, హితంగా, సత్యంగా, మితంగా మాట్లాడతాడో అతను ‘అజిహ్వుడు’ (జిహ్వలేనివాడు)’ అని పై శ్లోకానికి భావం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు పీఠాధిపతి అయిన కొత్తలో వంటవాడు భిక్ష వడ్డించాడు. ‘పప్పు చాలా బాగుంది. ఏం వేశావేంటి?’ అని అన్నారట స్వామి. ‘తోటకూర’ అని బదులిచ్చాడు వంటవాడు. మరునాడూ అదే చేశాడు. ‘ఇవాళ కూడా తోటకూర పప్పేనా!‘ అన్నారు స్వామి. మూడో రోజూ అదే పప్పు చేశాడు. ‘రోజూ తోటకూర పప్పే వేస్తున్నావు ఎక్కడిది?’ అని అడిగారట స్వామి. ‘మీరు బాగుందన్నారని చెబితే భక్తులు కట్టలు కట్టలు తోటకూర తెచ్చి పడేస్తున్నారు. అందుకని అదే చేస్తున్నాను’ అని చెప్పాడట వంటవాడు.
మరునాడు స్వామివారు గోశాలకు వెళ్లి గోమూత్రం ఆచమనం చేసి గోమయాన్ని నాలుకపై రుద్ది గదిలోకి వెళ్లిపోయారట. మూడు రోజులు బయటికే రాలేదు. ధ్యానమగ్నులై ఉండిపోయారట. స్వామివారు భిక్ష తీసుకోవడం లేదని పీఠం శ్రీ కార్యానికి తెలిసింది. ఏం అపచారం జరిగిందో అని అందరూ అనుకున్నారట. వంటవాడు ఏడుపు ముఖంతో వచ్చి ‘నేను మూడు రోజులూ తోటకూర పప్పే చేశాను. స్వామివారు బాగుందంటే.. భక్తులది విని రోజూ అదేపనిగా తోటకూర తెచ్చిపడేస్తున్నారు. అదీ స్వామివారికి చెప్పాను’ అన్నాడు. ఇంతలో స్వామి వేంచేసి ‘ఇందులో అతని పొరపాటు ఏం లేదు. నేను రేపు ఎక్కడికైనా విజయ యాత్రకు నడిచి వెళుతుంటే అందరూ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు అనరు. పేరు తెలియనివారు శంకరాచార్యుల వారు వెళుతున్నారని అంటారు. భక్తి వైరాగ్యాలు నేర్పవలసిన నా నాలుకే తోటకూర పప్పు రుచికి లొంగిపోతే.. ఎలా? ఇంద్రియ నిగ్రహం గురించి అనుగ్రహ భాషణం ఎలా? అందుకే రుచికి స్వాధీనమైపోయిన నాలుకను మూడు రోజులు శుద్ధి చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను’ అన్నారట.