వికారాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో గత నెల రోజులుగా వానలు కురియక రైతులు సాగు చేస్తున్న పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. జిల్లాలోని 594 గ్రామ పంచాయతీల్లో 510 గ్రామాల్లో ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నట్టు వ్యవసాయాధికారులు గుర్తించారు. కులకచర్ల, బంట్వారం, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లోని 42 గ్రామాల్లో అత్యధికంగా దాని ప్రభావం ఉన్నట్టు అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించారు.
ఈ గ్రామాల్లో రైతులు నాటిన విత్తనాలు మొలకెత్తినా వానలు కురియక ఎండిపోతున్నాయి. ఈ గ్రామాల్లో వేసిన పంటలను దున్ని ప్రత్యామ్నాయ పంటలు వేసేలా జిల్లా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా మరో 468 గ్రామాల్లోని పంటలపై మోస్తరుగా ఎల్నినో ప్రభావం ప్రభావమున్నట్టు అధికారులు అంచనా వేశారు. గత నెల రోజులుగా వర్షాలు లేకపోవడం వరి, పత్తి పంటలకు బదులు కందులు, మినుములు, పెసలు తదితర పంటలను సాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వరికి అధిక నీరు అవసరం అవుతుండడంతో ఈ వానకాలంలో ఆ సాగును సగానికిపైగా తగ్గించాలని నిర్ణయించారు.
జిల్లాలో 1,76,625 ఎకరాల్లో వరి, పత్తికి బదులుగా కందులు, మినుములు, పెసలు తదితర పంటలను సాగు చేసేందుకు జిల్లా రైతులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏటా వానకాలంలో వరి 1.50 లక్షల ఎకరాలకుపైగా సాగవుతుండగా.. ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా 79 వేల ఎకరాల్లోనే సాగు చేయాలని నిర్ణయించారు. కందులు 55,100 ఎకరాల్లో, పెసలు 9500, మినుములు 1500, అలసందలు 500, మొక్కజొన్న 5600, జొన్న 25, కూరగాయల పంటలు 5250, మరో 20 వేల ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేసేలా జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు జిల్లాలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 4,85,849 ఎకరాలు కాగా ఇప్పటివరకు 3,15,979 ఎకరాల్లో ఆయా పంటలను సాగు చేశారు. పత్తి 2,08,147 ఎకరాలు, కందులు 80,502 , మొక్కజొన్న 21,704, పెసలు 2296, జొన్న 163, మినుములు 723, సోయాబీన్ 930, ఇతర పంటలు 1874, ఉద్యానవన పంట లు 1560 ఎకరాల్లో రైతులు సాగు చేశారు.
జిల్లాలోని కులకచర్ల, బంట్వారం, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో ప్రభుత్వం కరవు పరిస్థితులున్నట్టు గుర్తించింది. ఈ మండలాల్లో వానకాలం ప్రారంభం నుంచి వర్షాభావ పరిస్థితులుండడంతో అధిక లోటు వర్షపాతం నమోదు కావడంతో ఇప్పటికే పంటలు ఎండుముఖం పట్టాయి. వానకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా జిల్లాలో అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. జిల్లాలో ఇప్పటివరకు సాధారణం కంటే లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 228 మి.మీటర్లుకాగా, 134.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆరు మండలాల్లో అధిక లోటు వర్షపాతం, మరో 10 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఆరు మండలాల్లో సాధారణం కంటే 60 శాతం నుంచి 99 శాతం మేర తక్కువ వర్షపాతం నమోదైంది.
కులకచర్ల మండలంలో సాధారణ వర్షపాతం 210 మి.మీటర్లు కాగా 51.1 మి.మీటర్ల వర్షపాతం నమోదుకాగా 76 మి.మీటర్ల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైంది. బంట్వారంలో సాధారణ వర్షపాతం 238.7 మి.మీటర్లు కాగా 53.4 మి.మీటర్లు, పెద్దేముల్ మండలంలో సాధారణ వర్షపాతం 256.5 మి.మీటర్లుకాగా, 33.4 మి.మీటర్లు, బషీరాబాద్ మండలంలో సాధారణ వర్షపాతం 240.1 మి.మీటర్లు కాగా 48.9 మి.మీటర్లు, కొడంగల్ మండలంలో సాధారణ వర్షపాతం 221 మి.మీటర్లుకాగా, 49 మి.మీటర్లు, దౌల్తాబాద్ మండలంలో సాధారణ వర్షపాతం 211.3 మి.మీటర్లుకాగా, 84.1 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.
అలాగే, లోటు వర్షపాతం నమోదైన మండలాలు.. మర్పల్లిలో సాధారణ వర్షపాతం 212 మి.మీటర్లుకాగా, 100.2 మి.మీటర్లు, నవాబుపేటలో 222.9 మి.మీటర్లలో 129.2 మి.మీటర్లు, పరిగిలో 225.1 మి.మీటర్లలో 141.5 మి.మీటర్లు, దోమ మండలంలో 213.6 మి.మీటర్లకుగాను 107.5 మి.మీటర్లు, ధారూరు మండలంలో 246.5 మి.మీటర్లకుగాను 160.1 మి.మీటర్లు, కోట్పల్లి మండలంలో 240.4 మి.మీటర్లకుగాను 127 మి.మీటర్లు, తాండూరు మండలంలో 256.5 మి.మీటర్లకుగాను 108.7 మి.మీటర్లు, యాలాల మండలంలో 234.8 మి.మీటర్లకుగాను 122 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.