ఇల్లెందు/ అశ్వారావుపేట/ కొత్తగూడెం టౌన్, మార్చి 16: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇల్లెందు పట్టణంలో జగదాంబ సెంటర్ నుంచి అంగన్వాడీలు, సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఈసం వెంకటమ్మ, అబ్దుల్నబీ మాట్లాడుతూ చలో హైదరాబాద్‌కు వెళ్తున్న అంగన్వాడీలను అరెస్టు చేయడాన్ని ఖండించారు.
తమ సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎస్కె ఫాతిమా, బత్తుల దేవేంద్ర, చింత రాంబాయి, సుశీల, వెంకటమ్మ, రమకుమారి, సరిత, రేణుక, సమత, వెంకటలక్ష్మి, శారద పాల్గొన్నారు. అశ్వారావుపేటలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల బాధ్యుడు కట్టా రాధ మాట్లాడుతూ సకాలంలో బిల్లులు అందక అంగన్వాడీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
పెండింగ్ బిల్లులతోపాటు ఐసీడీఎస్‌కు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కృష్ణవేణి, రాజేశ్వరి, లక్ష్మి, విజయ, ముత్తమ్మ, వెంకటరమణ పాల్గొన్నారు. మండల కేంద్రమైన సుజాతనగర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన, రాస్తారోకో నిర్వహించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు వీర్ల రమేష్, అంగన్వాడీ మండల నాయకురాలు నాగమణి, శశికళ, లలిత, మాధవి, రుక్మిణి, అనిత సంఘీభావం తెలిపారు. తోళ్ల జయమ్మ, వసంత, కాట్రాల తిరుపతిరావు, నల్లగోపు పుల్లయ్య, భాస్కర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.