ఆదిలాబాద్, జూలై 18(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో వానలు లేక రైతులు ఇబ్బందులు పడుతుండగా, భూగర్భజలాలు పెరగడం లేదు. వర్షాకాలం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా వాన జాడలేకపోవడంతో ఎండకాలం మేలో భూగర్భ జలమట్టం 9.78 మీటర్లు ఉండగా జూన్లో మరింత పడిపోయి 10.27 మీటర్లకు చేరాయి. గతేడాది జూన్లో 9.07 మీటర్లుగా ఉన్న నీటిమట్టం వర్షాలు పడకపోవడంతో 1.20 మీటర్ల లోతుకు పడిపోయింది. అంతే లోతులో ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు మండలాలు ఆదిలాబాద్ అర్బన్, బోథ్, భోరజ్, ఇంద్రవెల్లి, గాదిగూడ మండలాల్లో భూగర్భజలం 10 నుంచి 15 మీటర్ల లోతుకు చేరింది. బజార్హత్నూర్, జైనథ్, తలమడుగు, భీంపూర్, తాంసి, నార్నూర్, ఉట్నూర్, బేల, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో 10 మీటర్లు అంతకంటే తక్కువ లోతులోకి నీరు చేరింది. జూన్లో వర్షాలు పడకపోగా జూలై నెల 20 రోజులు గడుస్తున్నా.. పరిస్థితి మెరుగు పడలేదు. జిల్లాలో శనివారం వరకు 388 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 220.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

సాగు, తాగునీటికి ఇబ్బందులు
ఆదిలాబాద్ జిల్లాలో జూన్ రెండో వారంలో వర్షాలు పడడంతో రైతులు పత్తి, సోయా పంటలు వేశారు. వానలు లేకపోవడంతో పంటల ఎదుగుదల సరిగా లేదు. దీంతో రైతులు పంటలను కాపాడుకొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బోరుబావుల నుంచి స్ప్రింక్లర్లతో పంటలకు నీటిని అందిస్తున్నారు. సాగునీటి సౌకర్యం లేని రైతులు వానల కోసం ఎదురు చూస్తున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు సరిగా పడవని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు పత్తి పంటను కాపాడుకొనేందుకు పంట యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో స్వల్పకాలిక కంది, నువ్వులు, ఆముదం వంటి పంటలు వేయాలని రైతులకు సూచిస్తున్నారు. పత్తి వరుసల వెంబడి గుంతలు తీసి వర్షం నీరు భూమిలోకి పోయేలా చూడాలని సూచిస్తున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికులు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జిల్లాలో ఏటా జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు పడి భూగర్భ జలాల పెరుగుదల గణనీయంగా ఉంటుంది. జూలై నాలుగో వారంలో జిల్లాలో వర్షాలు జాడ లేకుండా పోయాయి. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో 10, 15 రోజుల్లో సాగు, తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.