‘ఎన్నికలకు ముందు రూ. 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెసోళ్లు చెబితే నమ్మినం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం చేసిన్రు. అన్ని అర్హతలున్నా రుణాలు మాఫీ చేయలేదు. నమ్మిన పాపానికి నట్టేట ముంచిన్రు. గీ సర్కారు ఉన్నన్ని రోజులు మాకీ తిప్పలు తప్పేలా లేవు’ అంటూ రైతులు రేవంత్ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటి వరకు మూడు విడుతల్లో రుణాలు మాఫీ చేయగా, ఈ విషయమై ‘నమస్తే తెలంగాణ’ బృందం ఆదివారం చెన్నూర్ మండలం కొమ్మెర, గంగార, కోటపల్లి మండలం కోటపల్లి, జైపూర్ మండలం టేకుమట్ల, మందమర్రి మండలం పొన్నారం, ఆదిల్‌పేట గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడగా, వారు ఆసక్తికర విషయాలు బయటపెట్టరు. రుణ మాఫీ పేరుతో కాంగ్రెస్ తమను మోసం చేసిందని వారు మండిపడ్డారు. శుక్రవారం రాత్రి రుణమాఫీ లిస్టును ప్రకటించారని, అందులో తమ పేర్లు లేవని, బ్యాంకులకు వెళ్లి అడిగితే వ్యవసాయశాఖ అధికారుల వద్దకు వెళ్లమని చెబుతున్నారని, వారిని సంప్రదిస్తేనేమో సరైన సమాచారం లేదు.. కనుక్కుంటామంటూ దాట వేస్తున్నారని రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు.
– చెన్నూర్, ఆగస్టు 18
చెన్నూర్ రూరల్, ఆగస్టు 18 : మా కుటుంబంలో ముగ్గురం వేర్వేరు బ్యాంకుల్లో రుణం తీసుకున్నం. మా నాన్న పేరు మీద క్రాప్ లోన్ రూ. లక్షా 60 వేలు ఉంది. మీ అమ్మ పేరు మీద క్రాప్‌లోన్ రూ.35 వేలు ఉంది. నా పేరుమీద రూ. 30 వేలు ఉంది. ఒక్క రేష న్ కార్డుకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తమని చెప్పి న్రు. కానీ.. మా ఇంట్లో ఎవ్వరికీ రుణం మాఫీ కాలే. బ్యాంకుకు వెళ్తే వ్యవసాయ శాఖ అధికారులను కలవమని చెప్పిన్రు. వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే మీకు రూ. 2 లక్షలకు మించి క్రాప్ లోన్ ఉంది అన్నరు. మూడో లిస్టులో రుణం మాఫీ అవుతుందన్నరు. శుక్రవారం మూడో లిస్టు కూడా వచ్చింది. అందులో మా పేర్లు లేవు. వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన్రు. రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైంది. కేసీఆర్ సర్కారులో గిట్లా లేకుండే.
– గుజ్జేటి గణేశ్, కొమ్మెర
కోటపల్లి, ఆగస్టు 18 : నా పేరిట రూ.1.06 లక్షలు. నా భార్య పేరిట రూ.1.09 లక్షల వరకు పంట రుణం ఉంది. రూ. 2 లక్షల దాకా రుణం మాఫీ అయితే మిగతా డబ్బులు కట్టాలి అనుకున్నం. కానీ లిస్టులో మా పేరు రాలేదు. మస్తు బాధ అనిపించింది. ఎన్నికల సమయంలో రూ.2 లక్షల దాకా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఇలా నట్టేట ముంచిండు. ఇకనైనా రైతులందరికీ న్యాయం చేయాలి.
– కొట్టె సంతోష్, కోటపల్లి
చెన్నూర్ రూరల్, ఆగస్టు 18 : కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు ముందు రూ. 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తమని చెబితే మస్తు సంబురపడ్డం. కానీ నమ్మి మోసపోయినం. నాకు రూ. 2 లక్షల 22 వేల రుణం ఉంది. శుక్రవారం రుణమాఫీ లిస్టు వస్తే చూసిన. అందులో నా పేరు లేదు. సార్లను వెళ్లి కలిస్తే రేషన్ కార్డు పరిశీలనలో ఉందని చెప్పిన్రు. కుటుంబ సభ్యుల వివరాలు మళ్లీ నమోదు చేసి దరఖాస్తు చేసుకోమన్నరు. నెల రోజులైతదన్నరు. అసలు క్రాపులోనుకు నా కుటుంబ సభ్యులకు సంబంధమేమిటో అర్థం కాలే. గీ లింకులు పెట్టుడేందో ఏమో. నాకు పట్టా పాస్బుక్కు ఉంది. పాన్ కార్డు ఉంది. నాతోటి రైతు ష్యూరిటీ పెట్టుకొని బ్యాంకోళ్లు రుణం ఇచ్చారు. గిట్లా లేనిపోనివి చెప్పి రుణమాఫీ చేయకపోవడం దారుణం. ఇట్లా నా ఒక్కడికే కాదు.. మా ఊరిలో చాలా మంది రైతులకు రుణం మాఫీ కాలేదు. గీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మాకీ తిప్పలు తప్పేలా లేవు.
– జనగామ రమేశ్, గంగారం
కోటపల్లి, ఆగస్టు 18 : నా పేరిట, నా భార్య పేరిట రూ.3 లక్షల దాకా రుణం ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో మా పేర్లు లేవు. వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నం. రుణమాఫీ పేరిట ఆశపెట్టి ఇలా మోసం చేయడం సరికాదు. రైతుభరోసా డబ్బులు కూడా ఇప్పటి దాకా ఇవ్వలే. కేసీఆర్ సర్కారులో ఇలా లేకుండే.
– కాశెట్టి పుల్లయ్య, కోటపల్లి
జైపూర్, ఆగష్టు 18 : నా పేరు రాజెల్లు. నా భార్య పేరు లక్ష్మి. మా ఇద్దరి పేరు మీద ఇందారం గ్రామీణ బ్యాంకులో రూ. 2 లక్షల 60 వేల పంట రుణం ఉంది. నా పేరు మీద రూ. లక్షా 60 వేలు. నా భార్య పేరు మీద రూ. లక్ష రుణం తీసుకున్నం. మూడో విడుతలో రూ. లక్షా 50 వేల నుంచి రూ. 2 లక్షల దాకా మాఫీ చేస్తరని ఆశపడ్డం. కానీ మూడో విడుత లిస్టు వచ్చింది. అందులో మా పేర్లు లేవు. ఇట్లా మా ఊరిలో 20 మంది దాకా రాని వారు ఉన్నరు. వ్యవసాయాధికారి కార్యాలయానికి వెళ్తే టెక్నికల్ సమస్య ఉంది అంటున్నరు. కొంతమందికి ఇచ్చి.. మరి కొంత మందికి ఇవ్వకపోవడం అన్యాయం.
– బల్ల రాజెల్లు, టేకుమట్ల
మందమర్రి రూరల్, ఆగస్టు 18 : కాంగ్రెసోళ్లు రుణాలు మాఫీ చేసినమంటూ గొప్పలు చెప్పుకుంటున్నరు. నేను రూ. లక్షా 65 వేల రుణం తీసుకున్న. కానీ నాకు కాలేదు. కేసీఆర్ సర్కారులో రుణం తీసుకుంటే మంచిగ మాఫీ చేసిన్రు. గీ కాంగ్రెసోళ్ల లెక్క లేనిపోని కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టలేదు. ఇకనైనా రైతులందరికీ న్యాయం చేయాలె.
– ముప్పిడి మల్లేశ్, పొన్నారం
మందమర్రి రూరల్, ఆగస్టు 18 : నేను రూ. 88 వేల రుణం తీసుకున్న. నెల రోజులుగా ఎంతో ఆశపడి ఎదురు చూస్తూ వచ్చాను. కానీ ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. అధికారుల చుట్టూ తిరిగిన. ఎవరూ స్పందించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుం టున్నది కానీ.. మాలాంటి రైతులకు అన్యాయం జరిగిందని గుర్తించడం లేదు. ఇకనైనా మేలు చేయాలి.
– కోలేటి శారద, ఆదిల్పేట్
కోటపల్లి, ఆగస్టు 18 : కాంగ్రెస్ ఎలాగై నా అధికారంలోకి రావాలని రైతులకు లేనిపోని హామీలిచ్చింది. ప్రధానంగా రూ. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని మభ్యపెట్టింది. ఇప్పుడు రుణ మాఫీ చేయకుండా రైతులను అరిగోస పెట్టుకుంటుంది. రైతు భరోసా డబ్బులు కూడా ఇప్పటి వరకు వేసింది లేదు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఇప్పటికైనా రైతులు గ్రహించాలి.
– సాంబాగౌడ్, పీఏసీఎస్ మండల అధ్యక్షుడు, కోటపల్లి
కోటపల్లి, ఆగస్టు 18 : కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ, రైతుభరోసా పేరిట మాయ మాటలు చెప్పి రైతులను మోసం చేసింది. ప్రతి గ్రామంలో రూ. 2 లక్షల రుణం తీసుకున్న రైతులు వందల సంఖ్యలో ఉన్నారు. కానీ కేవలం 10 మంది రైతులకు కూడా రుణమాఫీ కాలే. రైతులకు న్యాయం జరిగే వరకూ బీఆర్ఎస్ రైతుల వెన్నంటే ఉంటుంది.
– విద్యాసాగర్, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు