వడ్లపై టార్పాలిన్లు కప్పి ఉన్న ఈ దృశ్యం దహెగాం కొనుగోలు కేంద్రంలోనిది. గతేడాది ఈ కేంద్రంలో ఇదే సమయానికి 60 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈసారి మాత్రం ఇప్పటి వరకు కేవలం 7,200 క్వింటాళ్లు మాత్రమే సేకరించారు. ఈ ఏడాది దాదాపు 15 రోజులు ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులు సకాలంలో ధాన్యాన్ని అమ్మలేకపోయారు. ప్రస్తుతం అకాల వర్షాలతో ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతూ ఆందోళనకు చెందుతున్నారు.
వర్షానికి తడవకుండా ధాన్యంపై టార్పాలిన్ కప్పి ఉన్న ఈ దృశ్యం పెంచికల్పేట్ మండలం ఎల్లూరు లోనిది. పెంచికల్పేట్ మండలంలో 200 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 240 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం.. దీనికితోడు అకాల వర్షాలు తోడవడంతో రైతులు వడ్లను కాపాడుకునేందుకు అవస్థలు పడాల్సి వస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతాంగం నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. వరి కోతల ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాల్సిన యంత్రాంగం.. కోతలు ముగిసిన పక్షం రోజుల తర్వాత ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం వర్షాల నుంచి వడ్లను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
సేకరణంలో జాప్యం.. రైతన్నకు నష్టం
15 మండలాల పరిధిలో జిల్లా సహకార సంస్థ, ఐకేసీల ఆధ్వర్యంలో 34 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులకు ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందకు భిన్నంగా ఉన్నది. స కాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయకపోవడం.. సేకరణలో జాప్యం వల్ల కర్షకులు నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించిం ది. ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న అకాల వర్షా ల నుంచి ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొన్నది 5 వేల మెట్రిక్ టన్నులే..
జిల్లా వ్యాప్తంగా 24 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ యాసంగిలో 55 వేల మెట్రిక్టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేశారు. కానీ, ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో సుమారు 5 వేల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొన్నది. రైతులు పండించిన ధాన్యాన్ని సగం కూడా కొంటారో.. లేదోననే ఆందోళన నెలకొన్నది. వారం రోజులుగా అకాల వర్షాలతో రైతులు ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు కవర్లు కప్పిఉంచుతున్నారు. అయినప్పటికీ అక్కడక్కడా వరదకు వడ్లు తడిసి ముద్దయి రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. కోటి ఆశలతో సాగు చేసిన పంటకు ఫలితముంటుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.