కుంటాల, ఆగస్టు 23 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు రూ.2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేయాలని పెంచికల్పాడ్కు చెందిన రైతులు డిమాండ్ చేస్తూ శుక్రవారం కుంటాల మండల కేంద్రంలో తహసీల్ కార్యాలయం ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ వినతి పత్రం అందించారు. అనంతరం వ్యవసాయ అధికారి కార్యాలయానికి వెళ్లి రుణమాఫీ అధికారులను నిలదీశారు. రేషన్ కార్డు, ఇతర సాంకేతిక కారణాలను సాకుగా చూపి సగం మంది రైతులకు రుణమాఫీ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐ భాస్కరాచారి అక్కడికి వచ్చి బందోబస్తు నిర్వహించారు. ఈ నిరసనలో దిగంబర్ పటేల్, చంద్రకాంత్, గుద్దేటి కిష్టయ్య తదితరులున్నారు.
కుభీర్, ఆగస్టు 23 : మండలంలోని పార్డి(బీ) గ్రామంలోని పలువురు అర్హత ఉండి రుణమాఫీ కాని రైతులు శుక్రవారం స్థానిక రైతువేదిక రోడ్డుపై ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రుణమాఫీపై మంత్రుల మాటలకు పొంతన లేకుండా పోయిందని, ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేసి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తామని రైతులు హెచ్చరించారు. ఈ ఆందోళనలో మాజీ ఎంపీటీసీ బ్యారపు కానోబా, డాక్టర్ పోతన్న, బిజ్జం సంతోష్, శ్రీకాంత్, శ్రీనివాస్, ప్రవీణ్, శివలింగు, అనిల్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.