కౌటాల, మే 23 : ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్ల అకాల వర్షానికి వడ్లు తడిసిపోయాయని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని ఆయా గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేట, సిర్పూర్(టీ) పారిగాం కొనుగోలు కేంద్రాల వద్ద రాస్తారోకో నిర్వహించారు. ముత్తంపేటలోని కౌటాల-సిర్పూర్ ప్రధాన రహదారిపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ధర్నా చేయడంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వడ్లు అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వస్తే పొల్లు, తేమ శాతం ఉందని సాకులు చెబుతున్నారని మండిపడ్డారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇలా వర్షపు నీటి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అక్కడికి చేరుకుని రైతులకు మద్దతుగా రాస్తారోకోలో కూర్చున్నారు. రైతు కష్టాల గురించి కలెక్టర్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అదనపు కలెక్టర్ డేవిడ్ పారిగాం, ముత్తంపేట వరి కొనుగోలు కేంద్రాల వద్దకు చేరుకుని తడిసిన వడ్లను పరిశీలించారు. వారంలోగా వరి ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం తరుపున కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, ఇతర పార్టీల నాయకులు రైతులకు మద్దతు పలికారు.