ఆదిలాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పంపిణీ పరిహాసంగా మారింది. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వ పెద్దలు హామీలు ఇచ్చినా అమలులో మాత్రం జాప్యం జరుగుతోంది. వానకాలంలో ఆగస్టు రెండో వారంలో కురిసిన భారీ వర్షాలతో పత్తి, సోయాబీన్, తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షల రూపాయల పెట్టుబడులతో సాగు చేసిన పంటలు వరదలతో పూర్తిగా నష్టపోయాయి. కాత దశలో ఉన్న పంటలు నీటిలో కొట్టుకుపోయాయి. ప్రభుత్వం సూచనల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలు సేకరించారు. జిల్లాలో మొత్తం 20,548 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. పత్తి 15,103 ఎకరాలు, సోయాబీన్ 2,900, కంది 1,845, మొక్కజొన్న 660, ఇతర పంటలు 100 ఎకరాల్లో నష్టపోయినట్లు నివేదికలు తయారు చేశారు.
జిల్లాలో వర్షాల అనంతరం ఆగస్టు 19వ తేదీన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నష్టపోయిన పంటలను పరిశీలించారు. అధికారులతో సమావేశం నిర్వహించి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
రెండు రోజుల కిందట ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలతో రైతులు యాసంగిలో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పది రోజుల్లో రెండు పంటలు చేతికి రానుండగా వర్షాల కారణంగా నేలవాలాయి. సుమారు 68 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు తయారు చేశారు. భారీ వర్షాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నేను వానకాలంలో మూడు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశా. భారీ వర్షాలతో పంట మొత్తం కొట్టుకుపోయి రూ.2లక్షల వరకు నష్టం జరిగింది. జిల్లాలో పంటనష్టం ప్రాంతాల్లో ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రక టించారు. కాంగ్రెస్ నాయకులు మా గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వానకాలంలో పంటలు నష్టపోయిన రైతులకు మంత్రి హామీ ఇచ్చి ఏడు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు పరిహారం అందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో హామీల మాదిరిగాకాకుండా నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి.
– సతీశ్, రైతు, కజ్జర్ల, తలమడుగు