ఆదిలాబాద్ జిల్లాలో రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రెండు నెలల వ్యవధిలో ఐదుగురు.. ఈ రెండు రోజుల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధానంగా సాగు కలిసిరాకపోవడం, దిగుబడి తగ్గడం, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం, ప్రైవేటు అప్పులు, బ్యాంకు అధికారుల వేధింపులతో మృత్యువాత పడుతున్నారు. భూ తల్లిని నమ్ముకుని, రాత్రింబవళ్లు శ్రమించి సాగు చేసిన పంటలు చేతికి రాకపోవడంతో నిర్ణయాలు తీసుకుం టున్నారు. మరోవైపు ప్రభుత్వం రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో చేయకపోవడంతో మదనపడుతున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక పురుగుల మందునే పెరుగన్నంలా.. తలుగులనే ఉరితాళ్లుగా మలచుకుంటున్నారు.
ఆదిలాబాద్, జనవరి 19(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో 1.63 లక్షల మంది రైతులు ఉన్నారు. వానకాలంలో 5.78 లక్షలు, యాసంగిలో 1.80 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తారు. వీరితోపాటు 28,763 మంది కౌలు రైతులు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో పత్తి, సోయా, కంది పండిస్తారు. యాసంగిలో శనగ, జొన్న, గోధుమ సాగు చేస్తారు. రైతులు పెట్టుబడి కోసం బ్యాంకుల్లో రుణం తీసుకోవడంతోపాటు ప్రైవేటు అప్పులు చేస్తారు. కౌలు రైతులు ఎక్కువగా ప్రైవేటు అప్పులపైనే ఆధారపడుతారు. యేటా వానకాలంలో పత్తి సాగుకు అనుకూలమైన భూములు ఉండడంతో నాలుగు లక్షల ఎకరాల వరకు సాగవుతుంది. సోయాబిన్ 90 వేలు, కంది 70 వేల ఎకరాల్లో సాగు చేస్తారు.
రైతులు అధికంగా పండించే పత్తిలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనాల ఎంపిక మొదలుకుని, వర్షాలు అనుకూలించడం, తెగుళ్లు, చీడ-పీడల నివారణలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. విత్తనాలు వేసిన తర్వాత వర్షాలు పడకపోవడం, పూత, కాత దశలో వానలు అధికంగా పడడంతోపాటు గులాబీ రంగు పురుగు వంటి సమస్యలు అధిగమించాలి. సాగునీటి వనరులు తక్కువగా ఉండడంతో రైతులు వర్షాలపై ఆధారపడి వానకాలం పంటలు వేస్తారు. సకాలంలో వర్షాలు పడితే పంటలు పండుతాయి. జూన్లో వేసిన పత్తి డిసెంబరు వరకు, కంది జనవరి చివరి వరకు ఉంటుంది. ఈ సాగులో రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సాగులో భాగంగా పరిస్థితులు అనుకూలించకపోతే నష్టపోవాల్సి వస్తుంది.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వానకాలం పంటల కోసం అధికంగా అప్పులు చేస్తారు. పెట్టుబడి కోసం బ్యాంకుల్లో రుణాలు, దళారులు వద్ద అప్పులు తీసుకుంటారు. దళారులు, ప్రైవేటు అప్పుల కోసం అధిక వడ్డీ చెల్లిస్తారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వారు కౌలు డబ్బులతోపాటు సాగు కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. వీరు పూర్తిగా ప్రైవేటు అప్పులపై ఆధారపడుతారు. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు పలు మండలాల్లోని గ్రామాల్లో దళారులు విత్తనాలు, ఎరువులు, పెట్టుబడుల కోసం డబ్బులు ఇచ్చి పంటలను తమకే విక్రయించాలనే షరతులు విధిస్తారు. దీంతో రైతులు కష్టపడి సాగు చేసిన పంటలను తక్కువ ధరకు వారికి అమ్మి నష్టపోవాల్సి వస్తుంది.
తేదీ : డిసెంబర్ 1
పేరు : దోగ్రి జ్ఞానేశ్వర్(43)
గ్రామం : జున్ని
మండలం : ఇచ్చోడ
వ్యవసాయ భూమి : ఐదెకరాలు
కారణం : దిగుబడి రాక, అప్పులు తీర్చలేక..
ఎలా చనిపోయాడు : పొలం వద్దే చెట్టుకు ఉరివేసుకుని..
తేదీ : డిసెంబర్ 27
పేరు : వాగుమూడే రాజేందర్(53)
గ్రామం : టాకిగూడ
మండలం : గుడిహత్నూర్
కారణం : నాలుగో విడుత రుణమాఫీ జాబితాలో పేరు రాలేదు..
తీసుకున్న రుణం : బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో రూ.2.50 లక్షలు
ఎలా చనిపోయాడు : ఇంట్లో పురుగుల మందు తాగాడు
తేదీ : జనవరి 11
పేరు : కినక శంకర్(38)
గ్రామం : పిప్రి
మండలం : ఇంద్రవెల్లి
కారణం : అతివృష్టి కారణంగా
దిగుబడి రాలేదు..
తీసుకున్న రుణం : ప్రైవేటు వ్యాపారి వద్ద రూ.2 లక్షలు
ఎలా చనిపోయాడు : పురుగుల మందు తాగాడు
తేదీ : జనవరి 18
పేరు : జాదవ్ దేవ్రావు(51)
గ్రామం : రేణిగూడ
మండలం : బేల
వ్యవసాయం : ఐదెకరాలు
కారణం : బ్యాంకు అధికారుల వేధింపులు
తీసుకున్న రుణం : ప్రైవేట్ బ్యాంకులో రూ.3.50 లక్షలు,
రామాయి డీజీబీ బ్యాంకులో రూ.2 లక్షల
పంట రుణం, ప్రైవేటు వ్యక్తి వద్ద రూ.లక్ష
ఎలా చనిపోయాడు : బ్యాంకులో ఆవరణలోనే పురుగుల మందు తాగాడు
తేదీ : జనవరి 19
పేరు : రాథోడ్ గోకుల్(40)
గ్రామం : లింగోజీ తండా
మండలం : ఉట్నూర్
వ్యవసాయం : పదెకరాలు
(కౌలుకు తీసుకున్నాడు)
కారణం : పంటలు సరిగా పండకపోవడం,
ఆర్థిక ఇబ్బందులు
తీసుకున్న రుణం : ప్రైవేటుగా రూ.10 లక్షలు
ఎలా చనిపోయాడు : పురుగుల మందు తాగాడు