బేల, జూలై 7: ఆదిలాబాద్ జిల్లా బేల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా యూరియాను తరలిస్తున్న వాహనాలను బుధవారం ఉదయం సిర్సన్న గ్రామ రైతులు పట్టుకున్నారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సిర్సన్న గ్రామ సమీపంలో ఒక వాహనాన్ని పట్టుకోగా.. అందులో 100 బస్తాల యూరియా అలాగే, దాహిగావ్ గ్రామంలో మరో వాహనాన్ని పట్టుకోగా అందులో 50 యూరియా బస్తాలు ఉన్నట్లు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు. యూరియా బస్తాలతో సహా వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు నిక్కం దత్త ఇంట్లో 50 బస్తాలు దించినట్లు వాహన డ్రైవర్ చెప్పడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. బేల మండల కేంద్రంలోని హాకా సెంటర్ నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
యూరియా అక్రమ రవాణాపై రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి రైతులు అడుగుతున్నా బస్తాలు లేవని చెబుతూ.. మహారాష్ట్రకు ఎక్కడి నుంచి తరలిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, రైతులందరికీ సరిపోయే యూరియా డీఏపీ అందజేయాలని కోరారు.
యూరియా అక్రమ రవాణాపై జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌ను వివరణ కోరగా.. బేల మండల కేంద్రంలోని హకా సెంటర్‌కు సోమవారం సాయంత్రం 440 బస్తాల యూరియా వచ్చిందని, కానీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారి, విస్తరణ అధికారికి సమాచారం అందించకుండా హకా సెంటర్ నిర్వాహకుడు అక్రమంగా యూరియాను తరలించినట్లు తెలిపారు. సదరు హకా సెంటర్ నిర్వాహకుడి లైసెన్స్ రద్దు చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఐదుగురిపై కేసు
బేల వ్యవసాయ శాఖ అధికారి ఫిర్యాదు మేరకు హకా సెంటర్ నిర్వాహకుడు సునీల్, విక్రయదారుడు అజయ్, రెండు వాహనాల డ్రైవర్లు దిలీప్, చంద్రశేఖర్, మహారాష్ట్రలోని ఫెర్టిలైజర్ దుకాణ యజమాని నిఖిల్‌పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఎరువులను తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.